Begin typing your search above and press return to search.

ముగిసిన ఉక్కు డ్రామా..సీఎం ర‌మేష్‌ కు బాబు నిమ్మ‌ర‌సం

By:  Tupaki Desk   |   30 Jun 2018 11:04 AM GMT
ముగిసిన ఉక్కు డ్రామా..సీఎం ర‌మేష్‌ కు బాబు నిమ్మ‌ర‌సం
X
ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా ప‌ద‌కొండు రోజులు. బీపీ..షుగ‌ర్ లాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లున్న ఒక నేత ఏకంగా ప‌ద‌కొండు రోజుల పాటు దీక్ష చేస్తున్న వైనంపై ఇప్ప‌టికే వెల్లువెత్తిన ఆరోప‌ణ‌లు అన్ని ఇన్ని కావు. ఎక్క‌డైనా దీక్ష చేస్తే.. స‌ద‌రు నేత‌కు సంబంధించిన హెల్త్ బులిటెన్ ను రిలీజ్ చేయ‌టం ఆన‌వాయితీ.

కానీ.. సీఎం ర‌మేష్ చేస్తున్న ఉక్కు దీక్ష సంద‌ర్భంగా మాత్రం ఇలాంటివేమీ క‌నిపించ‌లేదు. క‌డ‌ప‌లో ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేయాలంటూ దీక్ష చేప‌ట్టిన టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ మీద వ‌చ్చిన‌న్ని జోకులు అన్నిఇన్ని కావు. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులైతే కుళ్లుతో ఇలా చేస్తార‌ని స‌ర్ది చెప్పుకోవ‌చ్చు. కానీ.. ఏకంగా ఏపీ టీడీపీ ఎంపీలే ఢిల్లీలో తాపీగా కూర్చొని.. నాకూ ఐదు కిలోలు త‌గ్గాల‌ని ఉంది.. వారం దీక్ష చేసే ఛాన్స్ ఇవ్వండంటూ ఎట‌కారం చేసుకున్న వైనంవీడియో క్లిప్పు సాక్షిగా బ‌య‌ట‌కు రావ‌టంతో.. తెలుగు త‌మ్ముళ్లు తేలు కుట్టిన దొంగ‌ల్లా ఉండిపోయారు.

మ‌నోళ్ల‌కు కాస్త అతి ఎక్కువే అన్న చందంగా.. త‌మ్ముళ్ల తీరుకు బాబు తిట్టుకునే ప‌రిస్థితి. క‌డ‌ప‌లో ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం సీఎం ర‌మేష్ చేప‌ట్టిన దీక్ష ప‌ద‌కొండో రోజుకు చేర‌టం.. అయిన‌ప్ప‌టికీ సీఎం ర‌మేష్ ఆరోగ్య ప‌రిస్థితి పెద్ద తేడా రాకుండా ఉండ‌టం.. దీనిపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మవుతున్న వేళ‌.. దీక్ష‌ను మ‌రింత సా..గిస్తే మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న ఉద్దేశ‌మో ఏమో కానీ.. మొత్తంగా దీక్ష టెంట్ ఎత్తేసేందుకు టీడీపీ డిసైడ్ అయ్యింది.

ముందుగా అనుకున్న ప్ర‌కార‌మే ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌డ‌ప‌కు రావ‌టం.. దీక్ష చేస్తున్న త‌న స‌న్నిహితుడిని ప‌రామ‌ర్శించి.. చేతికి నిమ్మ‌ర‌సం గ్లాస్ ఇవ్వ‌టం ద్వారా దీక్ష‌ను విర‌మింప‌చేశారు. సీఎం ర‌మేష్ తో పాటు దీక్ష చేస్తూ అనారోగ్యానికి గురైన మ‌రో ఎమ్మెల్సీ బీటెక్ ర‌వి చేత కూడా దీక్ష‌ను విర‌మింప‌చేశారు.

కేంద్రానికి ఐదు కోట్ల మంది ఆంధ్రుల త‌ర‌ఫున తాను డిమాండ్ చేస్తున్నాన‌ని.. రెండు నెల‌ల్లో క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌పై కేంద్రం నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు. కేంద్రం ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేస్తే స‌గం ఖ‌ర్చు భ‌రిస్తామ‌న్న ఆయ‌న ఈ అంశంపై క‌మిటీ వేసి కేంద్రంతో మాట్లాడ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మొత్తానికి గ‌త ప‌ద‌కొండు రోజులుగా హాట్ టాపిక్ గా మారిన సీఎం ర‌మేశ్ దీక్ష వ్య‌వ‌హారం ఈ రోజుతో ముగిసిన‌ట్లైంది.