Begin typing your search above and press return to search.

పెళ్లికి పిలిచిన సీఎం రమేష్ కు షాకిచ్చిన జగన్?

By:  Tupaki Desk   |   30 Jan 2020 4:25 AM GMT
పెళ్లికి పిలిచిన సీఎం రమేష్ కు షాకిచ్చిన జగన్?
X
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. అందుకే టీడీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నేత, సొంత జిల్లావాడు అయిన వైఎస్ జగన్ పై దారుణ విమర్శలతో టీడీపీ ఎంపీగా ఉన్న సీఎం రమేష్ ఆడిపోసుకునేవారు. కానీ కాలచక్రం గిర్రున తిరిగింది. వైఎస్ జగన్ సీఎం అయ్యారు. టీడీపీ నుంచి ఇదే సీఎం రమేష్ బీజేపీలోకి జంప్ అయ్యారు.

కడప జిల్లాకు చెందిన సీఎం జగన్, సీఎం రమేష్ లు వైఎస్ హయాం నుంచే బద్ధ శత్రువులు గా ఉంటూ వచ్చారు. చంద్రబాబు కు రైట్ హ్యాండ్ గా వ్యవహరించిన సీఎం రమేష్ సందర్భం వచ్చిన ప్రతీసారి జగన్ ను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

కానీ సీఎంగా జగన్ అయ్యాక.. రాజకీయ అవసరార్థం బీజేపీలో చేరిన సీఎం రమేష్ ఇప్పుడు దూకుడు తగ్గించాడు. బీజేపీ అధిష్టానం జగన్ కు మద్దతుగా ఉండడంతో ఈయన కూడా పాత పగలు మానేసి మౌనం దాల్చారు.

తాజాగా సీఎం రమేష్ తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు సతీసమేతంగా సీఎం జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే.. వివాహానికి ఖచ్చితంగా రావాలని కోరారట.. కానీ జగన్ రియాక్షన్ చూసి సీఎం రమేష్ షాక్ అయ్యాడట.. సీఎం రమేష్ కు నో చెప్పారట.. తాను పెళ్లికి రాలేనని జగన్ స్పష్టం చేశాడట.. రమ్మని ఎంత బతిమిలాడినా రాలేనన్నాడు..

దీనికి కారణం కూడా జగన్ వివరించి సీఎం రమేష్ ను కూల్ చేసినట్టు తెలిసింది. మీ పెళ్లికి తన రాజకీయ ప్రత్యర్థులు టీడీపీ అధినేత చంద్రబాబు, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వస్తారని.. అందుకే తాను రాలేనని అన్నారట.. తన రాజధానుల నిర్ణయం సహా ఇంగ్లీష్ మీడియం చదువులను వ్యతిరేకించిన వారి మధ్య కూర్చోవడం.. తనకు వారికి ఇబ్బందేనని అందుకే రానని సీఎం రమేష్ ప్రతిపాదనను తిరస్కరించాడట జగన్..

అయితే తనకు బద్ధ శత్రువు గా ఉండే జగన్ ను సీఎం రమేష్ ఎందుకు ఏరికోరి దగ్గర అవుతున్నాడనే చర్చ ఇప్పుడు రాజకీయాల్లో సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ వ్యాప్తంగా వందల కాంట్రాక్టులు పట్టిన సీఎం రమేష్ కు ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక ఆ బిల్స్అన్నీ ఆగిపోయాయట.. జగన్ ను వైరం పెట్టుకుంటే తన కొంప కొల్లేరేనని అందుకే స్నేహ హస్తం చాటుతూ దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నాడట.. కానీ జగన్ మాత్రం మనసు లో ఈ టీడీపీ మాజీ నేత విషయంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.