Begin typing your search above and press return to search.

బాబు కోట‌రితో సీనియ‌ర్ ఎంపీకి చుక్క‌లు

By:  Tupaki Desk   |   3 March 2016 11:04 AM GMT
బాబు కోట‌రితో సీనియ‌ర్ ఎంపీకి చుక్క‌లు
X
రాయలసీమలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంతో పాటు ప్ర‌తిప‌క్ష వైసీపీని టార్గెట్ చేసిన టీడీపీకి ఇపుడు పార్టీ నేత‌ల ఆలోచ‌న తీరే స‌మ‌స్యాత్మ‌కంగా మారిన‌ట్లు క‌నిపిస్తోంది. బ‌ల‌మైన‌ రెడ్డి సామాజిక వర్గాన్ని అక్కున చేర్చుకుని సీమ జిల్లాల్లో మరింత పుంజుకోవడానికి అధిష్టానం చకచకా పావులు కదుపుతుంటే పార్టీకి చెందిన కేంద్ర‌మంత్రి సుజ‌నాచౌద‌రి - సీమ‌కు చెందిన ఎంపీ - సీఎం ర‌మేష్ మ‌ధ్య విష‌యం న‌లుగుతోంది. కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చి రాజ్యసభ సభ్యుడిగా టర్మ్‌ పూర్తి చేసుకుని మరోసారి అవకాశం దక్కకపోవడంతో వైసీపీ గూటికి చేరిన‌ సీనియర్ నేత మైసూరారెడ్డి గురించి ఈ ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య వ్యూహ ప్ర‌తివ్యూహాలు జ‌రుగుతున్నాయి.

కడపకు చెందిన సీనియ‌ర్ నేత - మాజీ ఎంపీ మైసూరారెడ్డిని వైసీపీలో చేర్చుకొని జ‌గ‌న్‌ ను నైతికంగా దెబ్బ కొట్టాల‌నే టీడీపీ ఆలోచ‌న ప్ర‌కారం ఆయ‌న్ను తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి కేంద్ర మంత్రి సుజనాచౌదరి మంతనాలు కొనసాగిస్తున్నారు. అయితే సుజనా చౌదరికి మోకాల‌డ్డే ప్రయత్నం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ చేస్తున్నారని తెలుస్తోంది. కడప జిల్లాకే చెందిన సీఎం రమేష్‌ కు బాబు కోటరీ సభ్యుడిగా పేరుండ‌ట‌మే కాకుండా జిల్లాలో టీడీపీ పరంగా ఆయన హవానే నడుస్తోంది. మరోవైపు మైసూరారెడ్డికి టీడీపీ అధినేతతో గ‌ట్టి సంబంధాలే ఉన్నాయి. అలాంటి మైసురా తిరిగి పార్టీలోకి వస్తే జిల్లాలో తన ప్రాబల్యానికి గండి పడుతుందని అనుకుంటున్నారో తెలియ‌దు కానీ సుజనాచౌదరి ప్రయత్నాలను గట్టిగానే అడ్డం పడుతున్నార‌ని ప‌లువురు తెలుగుదేశం నాయ‌కులు చెప్తున్నారు.

సీఎం రమేష్‌ అలా అడ్డుపడుతుండటానికి ఇంకో కారణం కూడా వినిపిస్తోంది. తన జిల్లాకు చెందిన మైసూరాని సుజనాచౌదరి పార్టీలోకి తీసుకొస్తే కోటరీలో తన ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతుందని ఆయన భావిస్తున్నట్లు చెప్తున్నారు. పార్టీలోకి వస్తే గిస్తే తన ద్వారా రావాలి కాని ఎవరి ద్వారానో వస్తే ఎలా అని లెక్కలు వేసుకుంటున్నారంట. మొత్తమ్మీద మైసూరా ఇష్యూ సుజనా - రమేష్‌ ల మధ్య ఆధిపత్య పోరుకి తెరలేపినట్లు కనిపిస్తోందిప్పుడు.