Begin typing your search above and press return to search.

అవునా... తెదేపాకు అంత ధైర్యం ఉందా?

By:  Tupaki Desk   |   3 April 2018 5:05 AM GMT
అవునా... తెదేపాకు అంత ధైర్యం ఉందా?
X
"మేం తలుచుకుంటే ప్రధాని ఇంటి ముందు మా పార్టీ ఎంపీలంతా కలిసి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం... మీరు ఆ పని చేయ గలరా?" అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేష్ విసిరిన సవాలు ప్రజల్లో కొత్త చర్చకు అవకాశం కల్పిస్తోంది. ప్లకార్డులు పట్టుకుని పార్లమెంటు ఎదుట రోజూ కాసేపు నినాదాలు చేయడం, ఇక్కడ రాష్ట్రంలో నల్ల రిబ్బన్లు తగిలించుకుని కార్యాలయాలకు వెళ్లడం మినహా... నిర్దిష్టంగా ఎలాంటి పోరుబాట అనుసరించని తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కసారిగా ప్రధాని ఇంటిముందు ధర్నా చేసే అంతగా ఉద్యమ బాట పడతారా అనేది ప్రజల్లో సందేహంగా ఉంది.

చంద్రబాబు నాయుడు మంగళ బుధవారాలలో ఢిల్లీలోని ఉండబోతున్నారు. భారతీయ జనతాపార్టీని వ్యతిరేకించే దేశంలోని అనేక పార్టీల కీలక నాయకులతో ఆయన భేటీ కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీలను సాధించడానికి వారందరి మద్దతు కూడగడతానని చంద్రబాబునాయుడు రంకెలు వేస్తున్నారు. పార్లమెంటు వేదికగా పోరాటాలు సాగించినప్పుడు ఈ అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియజేసినా కనపడని ఫలితం ఇప్పుడు ఆయా పార్టీల నాయకులతో వారి వారి ఆఫీసు గదిలో భేటీ అయితే ఎలా వస్తుందని రాష్ట్ర ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి.

తన ఢిల్లీ టూరు వలన నిర్దిష్టంగా దక్కే ప్రయోజనం ఇసుమంతయినా లేదని చంద్రబాబుకు కూడా తెలుసు. మరొకవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షలకు సిద్ధమవుతూ మైలేజి సాధిస్తున్నారని కూడా ఆయనకు ఒక అభిప్రాయం ఉంది. దానికి కౌంటర్ గా తమ పార్టీ తరఫున కూడా ఏదైనా గట్టి కార్యక్రమం చేయాలనే ఆలోచిస్తున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. ఈ సమాచారం తో సీఎం రమేష్ మాటలను పోల్చి చూసుకున్నప్పుడు, గృహాన్ని ఇంటి ఎదుట ధర్నా చేయడానికి తెదేపా ఎంపీలు ఉమ్మడిగా వెళతారా అని అనిపిస్తోంది. కానీ ఇప్పటిదాకా విభజన హామీల అమలు సాధించడానికి ఎలాంటి గట్టి ప్రయత్నం చేయని తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా ఎంత దూకుడు ప్రదర్శిస్తుందా? అని ప్రజల్లో సందేహాలు రేగుతున్నాయి.

సీఎం రమేష్ మాటవరసకు ఏదో డాంబికంగా ఆ మాటలు చెప్పారో... లేదా నిజంగానే వారికి అంత పోరాటపటిమ ఉందొ మరో రెండు రోజుల్లో తేలిపోతుంది .