Begin typing your search above and press return to search.

పీకేకు సీఎం సీటు ఆఫ‌ర్‌... బీజేపీ వ్యూహ‌మేంటంటే?

By:  Tupaki Desk   |   1 April 2021 12:30 AM GMT
పీకేకు సీఎం సీటు ఆఫ‌ర్‌... బీజేపీ వ్యూహ‌మేంటంటే?
X
కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ వ్యూహాలు, ప్ర‌ణాళిక‌లు ఒక్క ప‌ట్టాన అర్థం కావు. గ‌తంలో అయితే ఓకే గానీ... ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల చేతుల్లోకి పార్టీ వెళ్లాక‌... బీజేపీ వ్యూహాల‌ను ప‌సిగ‌ట్ట‌డం సొంత పార్టీ నేత‌ల‌కు కూడా సాధ్య ప‌డ‌టం లేదు. ఇక బ‌య‌టి వ్య‌క్తులు, రాజ‌కీయ విశ్లేష‌కులకు అయితే బీజేపీ గేమ్ ప్లాన్ ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతుంటుంద‌న్న భావ‌న త‌ప్పించి... ఆ ప్లాన్ ఏమిట‌న్న విష‌యం మాత్రం అంతుచిక్క‌డం లేదు. ఇదంతా ఎందుకు చెప్పుకోవాలి అంటే... ఏపీ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఓ స్ట్రాట‌జీతో పాటు ఓ బ‌లాన్ని పెంచుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ... ప్ర‌స్తుతం తిరుప‌లి లోక్ స‌భ స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో త‌న‌దైన వ్యూహాల‌ను అమ‌లు చేస్తోంది. అందులో భాగంగా త‌న మిత్ర‌ప‌క్షం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఏకంగా సీఎం సీటును ఆఫ‌ర్ చేస్తూ బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన ప్ర‌క‌ట‌న‌తో ఒక్క‌సారిగా పెను క‌ల‌క‌ల‌మే రేగింద‌ని చెప్పాలి.

ఈ ప్ర‌క‌ట‌న అటు బీజేపీతో పాటు ఇటు దాని వైరి వ‌ర్గాల‌ను పెద్ద‌గా షాక్ కు గురి చేయ‌కున్నా... జ‌న‌సేన‌ను మాత్రం బాగానే ప్ర‌భావితం చేసింద‌ని చెప్పాలి. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ... ప్రాంతీయ పార్టీకి అది కూడా మెజార్టీ సీట్లు దక్కించుకునేంత బ‌లం ఎంత‌మాత్రం లేని జ‌న‌సేనానికి సీఎం సీటు ఆఫ‌ర్ అంటే... అందులో ఏదో మ‌త‌ల‌బు ఉన్న‌ట్టే క‌దా. అదేమిట‌నేది ఏ ఒక్క‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు. జ‌న‌సైనికులు మాత్రం ఈ విష‌యాన్ని అంత‌గా ప‌ట్టించుకోకుండా... త‌మ పార్టీ అధినేత ఏకంగా సీఎం సీటు ఎక్కి కూర్చోనున్నార‌న్న ఊహ‌ల్లో తేలిపోతున్నారు. జ‌న‌సైనికుల‌ను భ్ర‌మ‌ల్లో పెట్టేసి తిరుప‌తి ఉప పోరులో ల‌బ్ధి పొందాల‌న్న‌ది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. జ‌న‌సేనాని గానీ, జ‌న సైనికులు గానీ పెద్ద‌గా రాజ‌కీయంగా అవ‌గాహ‌న లేని వైనాన్ని క్యాష్ చేసుకునే క్ర‌మంలోనే బీజేపీ ఈ పాచికను విసిరింద‌న్న వాద‌న‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. అంతేకాకుండా గెల‌వ‌లేక‌పోయిన‌ప్పటికీ త‌న‌కంటే ఓట్ షేర్ లో కాస్తంత పై మెట్టుపై ఉన్న జ‌న‌సేన‌ను ప్ర‌స‌న్నం చేసుకుంటే... ఆ పార్టీ కేడ‌ర్ ను వినియోగించుకుంటే... తిరుప‌తి బ‌రిలో మ‌ర్యాద‌పూర్వ‌క‌మైన స్థాయిలోనైనా ఓట్లు ప‌డ‌త‌య‌న్న‌ది బీజేపీ భావ‌న‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

సాధార‌ణంగా బీజేపీ ఏ రాష్ట్రంలోనూ ఎన్నిక‌ల్లో సీఎం అభ్య‌ర్థి ఫ‌లానా నేత అని ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించిన దాఖ‌లా ఇప్ప‌టిదాకా లేద‌నే చెప్పాలి. త‌న‌కు మంచి బ‌లం ఉన్న ఉత్త‌రాధి రాష్ట్రాల్లోనూ బీజేపీ ఈ ప్లాన్ తోనే ఎన్నిక‌ల‌కు వెళుతున్న వైనం మ‌న‌కు తెలిసిందే. అంతేకాకుండా... ఎన్నిక‌ల అనంత‌రం త‌న‌కు ఏమాత్రం త‌క్కువ సీట్లు వ‌చ్చినా... త‌న మిత్ర‌ప‌క్షాల‌కు సీఎం సీటును వ‌దిలే విష‌యంలో బీజేపీ త‌న‌దైన మార్కు వ్యూహాన్ని అమ‌లు చేస్తున్న వైనం కూడా మ‌న‌కు తెలిసిందే. ఈ భావ‌న‌తోనే మ‌హారాష్ట్ర‌లో ఏళ్ల త‌బ‌డి త‌న‌తో క‌లిసి సాగుతున్న శివ‌సేన‌కు సీఎం సీటును ఇచ్చేందుకు బీజేపీ అంగీక‌రించ‌లేదు. అందుకోసం ఏకంగా తాను విప‌క్షంలో కూర్చునేందుకు కూడా సిద్ధ‌ప‌డింది. ఇక బీహార్ లో నితీశ్ కుమార్ ను ఎప్పుడెప్పుడు సీఎం సీటు నుంచి దించేసి త‌న పార్టీ నేత‌ను ఆ సీట్లో కూర్చోబెడ‌దామా అన్న దిశ‌గా చూస్తోంది. ఇక క‌ర్ణాట‌క విష‌యంలో బీజేపీ వ్యూహం ఎప్పటిక‌ప్పుడు... ఆయా ప‌రిస్థితుల‌కు అనుగుణంగానే మారుతూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్ని వ్యూహాలు మారినా కూడా సీఎం సీటును మిత్ర‌ప‌క్షాల‌కు ఇచ్చే విష‌యంలో బీజేపీ ఆది నుంచి స‌సేమిరా అనే అంటోంది. మ‌రి అలాంటిది ఏపీలో మాత్ర‌మే త‌న మిత్ర‌పక్షం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కు సీఎం సీటును ఎలా ఆఫ‌ర్ చేసింద‌న్న‌విష‌యమే ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరుప‌తి ప‌రిధిలో నోటా కంటే కూడా త‌క్కువ ఓట్ల‌ను సాధించిన బీజేపీ ప‌రువు పోగోట్టుకుంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కాస్తంత గ‌ట్టిగానే నిల‌బ‌డిన‌ట్టు క‌నిపించిన జ‌న‌సేన... బీజేపీ కంటే కూడా మెరుగైన ప్ర‌దర్శ‌న‌నే క‌న‌బ‌ర‌చింది. ఇక తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలో జ‌న‌సేనాని సామాజిక వ‌ర్గం ఓట్లు కాస్తంత ఎక్కువ‌గానే ఉన్నాయి. ఆ కార‌ణంగానే తిరుప‌తి బ‌రిలో తాము నిల‌బ‌డ‌తామంటూ ప‌వ‌న్ ప‌దే ప‌దే చెప్పుకున్నారు. అయినా కూడా ప‌వ‌న్ విజ్జ‌ప్తిని ప‌క్క‌న‌పెట్టేసిన బీజేపీ... త‌న అభ్య‌ర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి ర‌త్న‌ప్ర‌భ‌ను రంగంలోకి దింపింది. ఈ క్ర‌మంలో జ‌న‌సైనికులు ప‌నిచేయ‌క‌పోతే... ర‌త్న‌ప్ర‌భ‌కు ఏమాత్రం ఓట్లు ప‌డే ప‌రిస్థితి లేదు. మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కంటే కూడా త‌క్కువ ఓట్లు వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌నే చెప్పాలి. ఇలాంటి ప‌రిస్థితి నుంచి త‌ప్పించుకునేందుకే బీజేపీ న‌యా ప్లాన్ ను ర‌చించింద‌ని చెప్పాలి. అందులో భాగంగానే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ కూట‌మి అధికారంలోకి వ‌స్తే... జ‌నసేనానే సీఎం అంటూ వీర్రాజు చేత చెప్పించింది. ఈ మాట‌ను మోదీనే ఫైన‌ల్ చేశారని కూడా క‌లరింగ్ ఇచ్చింది. ఈ ప్లాన్ తో జ‌న‌సైనికుల‌ను భ్ర‌మ‌ల్లో ముంచేసి త‌న ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని బీజేపీ వ్యూహం ర‌చించింద‌న్న మాట‌. మ‌రి ఈ ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందో, లేదో చూడాలి.