Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కొత్త పదవులకి లైన్ క్లియర్!

By:  Tupaki Desk   |   16 March 2020 6:10 AM GMT
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కొత్త పదవులకి లైన్ క్లియర్!
X
లాభదాయక పదవుల జాబితా నుంచి 29 చైర్మన్‌ పదవులను మినహాయిస్తూ చేసిన సవరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. ఈ చట్టం నుంచి హెచ్‌ ఎండీఏ చైర్మన్, వైస్‌ చైర్మన్, మెంబర్స్, డైరెక్టర్లు, రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ ప్రాంతీయ బోర్డుల డైరెక్టర్లు, రాష్ట్ర రైతు సమన్వయ సమితి, ఎంబీసీ, మూసీ రివర్‌ ఫ్రంట్, కార్మిక సంక్షేమ బోర్డు, సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్లు, యాదగిరిగుట్ట, వేములవాడ దేవాలయ అభివృద్ధి సంస్థలు తదితరాల చైర్మన్లను మినహాయిస్తూ ప్రతిపాదించిన సవరణ బిల్లుకు ఆదివారం సభ ఆమోదం తెలిపింది.

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ కార్పొరేషన్ల చైర్మన్ పదవులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే చాన్స్ ఉందని టీఆర్ఎస్ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. గత ఏడాది డిసెంబరులో రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవిని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ పదవిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇవ్వడం సాధ్యం కాదని.. అది ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’ కిందికి వస్తుందని అధికారులు అభ్యంతరం చెప్పారు.

దీంతో ప్రభుత్వం 2019 డిసెంబర్ 4న ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నుంచి 29 సంస్థల చైర్మన్ పదవులను మినహాయిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లోకి చేరిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఆ పదవి ఆర్డినెన్స్ జారీకి ముందు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఉండేది. మొత్తం ఇప్పటి వరకు 150 కార్పొరేషన్ల పదవులను ఈ రూల్ నుంచి మినహాయించారు.

తెలంగాణ పేమెంట్‌ ఆఫ్‌ శాలరీస్, పెన్షన్స్‌ అండ్‌ రిమూవల్‌ ఆఫ్‌ డిస్‌క్వాలిఫికేషన్‌ యాక్ట్, 1953 సెక్షన్‌ 10లో పొందుపరిచిన మేరకు.. వివిధ సంస్థల చైర్మన్లుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటే వారు లాభదాయక పదవులు కలిగి ఉన్నందుకు అనర్హత వేసే నిబంధన వర్తించకుండా గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా గతంలో 23 చైర్మన్‌ పదవులుండగా, తాజాగా ఆ జాబితాలో మరో 29 చైర్మన్‌ పదవులను అదనంగా కలుపుతూ సవరణ చట్టం చేశారు.