Begin typing your search above and press return to search.
గాలి శాపం:సిద్ధరామయ్యను దేవుడే శిక్షిస్తాడు
By: Tupaki Desk | 5 May 2018 8:41 AM GMTమైనింగ్ కింగ్, బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక ఎన్నికల సందర్భంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కన్నడ ఎన్నికల్లో తన సత్తా చాటుకోవడంతో పాటుగా తన ఆప్తుడు అయిన శ్రీరాములును గెలిపించేందుకు గాలి శ్రమిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్న గాలి జనార్దన్ రెడ్డి ప్రత్యేక కార్యాచరణలో భాగంగా బెంగళూరు నుంచి మకాం మార్చారు. గాలి శిబిరాన్ని ప్రతీరోజు దాదాపు 5 వేల మంది బీజేపీ కార్యకర్తలు వచ్చివెళ్తున్నారంటే ఆయన ప్రచారంలో ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గాలి బ్రదర్స్‌ను ఎద్దేవా చేస్తున్నారు. గాలి బ్రదర్స్, యడ్యూరప్పను టార్గెట్ చేస్తూ టూ రెడ్డీస్ + వన్ యెడ్డీ అంటూ కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సెటైర్లు వేస్తున్నారు. దీంతో గాలి జనార్దన్ రెడ్డి భగ్గుమన్నారు.
కాగా, కర్నాటక ఎలక్షన్స్ లో భాగంగా బళ్లారిలో ప్రచారం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ గాలి జనార్ధన్ రెడ్డి వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ బళ్లారి జిల్లా, చుట్టు పక్కల జిల్లాల్లో బీజేపీ ప్రచార భాధ్యతలను గాలికి అప్పగించాలన్న బీజేపీకి ఇది ఎన్నికల ముందు పెద్ద షాక్ అని చెప్తున్నారు. గాలి జనార్ధన్ రెడ్డి బళ్లారిలో అడుగుపెట్టకూడదని గతంలో ఉన్న ఆదేశాలే వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. దీంతో బీజేపీ శ్రేణులు డీలా పడ్డాయి. ఓ వైపు కోర్టు తీర్పు మరోవైపు ముఖ్యమంత్రి కామెంట్ల నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీఎం సిద్ధరామయ్యపై విరుచుకుపడ్డారు.సిద్ధరామయ్య మొత్తం అబద్ధాలు చెబుతున్నారని… ఆయన జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. దేవుడు ఏదో ఒకరోజు సిద్ధరామయ్యను శిక్షిస్తాడంటూ గాలి జనార్ధన్ రెడ్డి సంచలన జోస్యం చెప్పారు.
కర్ణాటకలో సిద్ధరామయ్య ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలవుతారని, బీజేపీ అధికారంలోకి వస్తుందని గాలి జనార్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు. సీఎం సిద్ధరామయ్య అన్నీ అబద్ధాలే చెబుతారు ఆయన రాష్ట్రంలో పేదలకు, ఇతర ప్రజలకు ఏఒక్క మంచి పని చేయలేదని విమర్శించాడు. ప్రజలు బీజేపీకి మద్దతిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మే 12వ తేదీన కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ ఎలా ఉన్నా ఈ ఎన్నికల్లో గాలి బ్రదర్స్ వర్సెస్ సీఎం సిద్ధరామయ్య కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయంటున్నారు.