Begin typing your search above and press return to search.

సీఎం స‌ర్ జూలై 15 వ‌చ్చేసింది !

By:  Tupaki Desk   |   13 July 2022 10:30 AM GMT
సీఎం స‌ర్ జూలై 15 వ‌చ్చేసింది !
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్లో రోడ్లు అస్త‌వ్య‌స్తంగా ఉన్న తీరుపై ఇప్ప‌టికే అనేక సార్లు జ‌న‌సేన సోష‌ల్ మీడియాలో పోస్టులు ఉంచింది. అదేవిధంగా డిజిట‌ల్ మీడియాలో ఓ విప్ల‌వాన్నే తీసుకుని వ‌చ్చింది. గ‌తుకుల‌మ‌యం అయిన రోడ్ల ఫొటోల‌ను ఉంచుతూ భీమ‌వ‌రంలాంటి ప్రాంతాలు మొద‌లుకుని స్పీక‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ఆమ‌దాల‌వల‌స వ‌ర‌కూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఇవి చూసి వైసీపీ కార్య‌క‌ర్త‌లు జ‌న‌సేన‌తో త‌గాదాల‌కు దిగిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. భౌతిక దాడుల‌కు కూడా పాల్ప‌డిన సంఘ‌ట‌న‌లూ ఉన్నాయి. ఆ త‌రువాత కూడా ప‌వ‌న్ ఈ ఉద్య‌మాన్ని కొన‌సాగించండి అని వీలున్నంత వ‌ర‌కూ దీనిని ఉద్ధృతం చేయాల‌ని పిలుపునిచ్చారు.

తాజాగా గుడ్ మార్నింగ్ సీఎం స‌ర్ .. అనే మూమెంట్ ను కూడా తీసుకుని వ‌స్తున్నారు జ‌న‌సేనాని. ఈనెల 15, 16, 17 తేదీల్లో జరిగే డిజిటల్ క్యాంపెయిన్ లో పవన్ కల్యాణ్ పాల్గొంటున్నారు. మ‌రోవైపు జూలై 15 నాటికి ఒక్క గుంత కూడా క‌నిపించకూడ‌ద‌ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు అధికారుల‌కు ! కానీ ఇప్పుడు ఆ ఆదేశాలు ఏవీ అమ‌ల్లోకి రాలేదు.ప్యాచ్ వ‌ర్క్ లతోనే స‌రా!

సీఎం ప‌ర్య‌ట‌న అన్న‌ది ఇటీవ‌ల శ్రీ‌కాకుళం న‌గ‌రంలో సాగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇక్క‌డ అమ్మ ఒడి (మూడో విడ‌త‌) ప‌థ‌కంకు సంబంధించి నిధులు విడుద‌ల చేసి మాట్లాడారు. అదేవిధంగా స‌భ‌ను నిర్వ‌హించేందుకు ఎంపిక చేసిన కేఆర్ స్టేడియంకు ప‌దికోట్లు విడుద‌ల చేశారు. ఇంత‌వ‌రకూ బాగానే ఉన్నా సీఎం ప‌ర్య ట‌న సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌యాణించిన మెయిన్ రోడ్ల‌ను కూడా పూర్తిగా బాగు చేయ‌లేదు. అవి కూడా ప్యాచ్ వ‌ర్కుల‌తోనే స‌రిపెట్టేశారు.

ఓ వైపు ఆరు లైన్ల పేరిట జాతీయ రహ‌దారికి మోడీ మ‌హ‌ర్ద‌శ తీసుకువ‌స్తే, మ‌న‌వైపు మాత్రం గ్రామీణ ర‌హ‌దారులు అత్యంత దుర్భరావ‌స్థ‌లో ఉన్నాయి అన్న‌ది అంగీకరించ‌క త‌ప్ప‌ని నిజం. రోడ్ల మ‌ర‌మ్మ‌తుల‌కు సంబంధించి ముఖ్య‌మంత్రి రెండు వేల కోట్ల రూపాయ‌లు ఇస్తామ‌ని చెప్పారు.

ఆ నిధులు విడుదల‌య్యాయో లేదో తెలియ‌దు.. ఇప్పుడేమో వ‌ర్షాకాలం మొద‌ల‌యిపోయింది. పోయిన ఏడాది వ‌ర‌ద‌ల‌కు కొట్టుకుపోయిన లేదా కోత‌కు గుర‌యిపోయిన ర‌హ‌దారుల‌కు ఇప్ప‌టికీ మోక్షం లేదు.

అవ‌న్నీ దార్లోకి తేవాలంటే త‌క్ష‌ణ మ‌ర‌మ్మ‌తుల‌కు అయిన త‌క్కువ‌లో త‌క్కువ ఓ వెయ్యి కోట్లు కావాలి. కేంద్రంను అప్ప‌ట్లో అభ్య‌ర్థించినా నిధులు ఇవ్వ‌లేదు.
ఈ నేప‌థ్యంలో గుడ్ మార్నింగ్ సీఎం స‌ర్ పేరిట జ‌న‌సేన చేప‌ట్టే డిజిట‌ల్ ఫైట్ ఏ మేర‌కు ఫ‌లితాలు ఇస్తుందో చూడాలిక.