Begin typing your search above and press return to search.

రాహుల్ పాదయాత్ర వేళ కాంగ్రెస్ భారీ షాకిచ్చిన స్టాలిన్ అన్న

By:  Tupaki Desk   |   16 Sep 2022 4:20 AM GMT
రాహుల్ పాదయాత్ర వేళ కాంగ్రెస్ భారీ షాకిచ్చిన స్టాలిన్ అన్న
X
ఎన్ని వ్యూహాలు.. మరెన్ని ఎత్తులు.. ఇంకెన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీని పైకి లేపే విషయంలో తరచూ ఎదురు దెబ్బలు పడుతున్న వేళ.. మోడీ లాంటి నేతను ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ కు తరచూ తప్పటడుగులు వేస్తోంది. ధీటుగా బదులిచ్చే విషయంలో పడుతున్న తప్పులు.. అధికారానికి దూరం చేస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. దేశంలోని అన్ని రాష్ట్రాల్ని కవర్ చేసేలా పాదయాత్రకు భారీ ప్లాన్ వేసుకొని రంగంలోకి దిగారు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ. తన చారిత్రక పాదయాత్రను తమిళనాడుతో మొదలుపెట్టి.. కేరళకు వెళ్లిన వైనం తెలిసిందే.

రాహుల్ గాంధీ పాదయాత్రను షురూ చేయటానికి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రత్యేకంగా రావటం ఒక ఎత్తు అయితే.. ఆత్మీయంగా హగ్ చేసుకున్న వైనం అందరిని ఆకర్షించింది. స్టాలిన్ ఆత్మీయ హగ్ కు రాహుల్ సైతం సంతోషపడిపోయారు. తాను చేసే పాదయాత్రతో కాంగ్రెస్ కు పుర్వ వైభవం కాకున్నా.. ఆ దిశగా కొంత మేర అయినా అడుగులు పడతాయన్న ఆశతో ఈ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

యూపీఏ సర్కారుకు మిత్రపక్షంగా వ్యవహరిస్తూ మోడీ వైపు వెళ్లకుండా కాంగ్రెస్ తో కలిసి ఉండేందుకు ఆసక్తి చూపే స్టాలిన్.. రాహుల్ పాదయాత్ర సందర్భంగా ఆయన్ను ఎమోషనల్ హగ్ ఇచ్చేసిన వైనాన్ని రాజకీయ చర్చకు తెర తీసింది. అయితే.. ఇలాంటి వాదనలకు చెక్ చెబుతూ.. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నోటి నుంచి సంచలన వ్యాఖ్యలు వచ్చాయి.

మరో ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు వచ్చేస్తున్న వేళ.. కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేలాంటి కీలక ప్రకటన ఒకటి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నోటి నుంచి వచ్చేసింది. అదేమంటే.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోని అన్ని స్థానాలకు డీఎంకే పోటీ చేస్తుందని.. గెలిపించాలని కోరటం గమనార్హం. విరుదానగర్ లో జరిగిన కార్యక్రమానికి హాజరైన సీఎం స్టాలిన్.. 'అన్ని నియోజకవర్గాల్లోడీఎంకేను గెలిపించాలి. 2024 పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి. ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్దం కావాలి' అని వ్యాఖ్యానించారు.

ఇదంతా చూసినప్పుడు 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలినట్లేనన్న భావన బలంగా అనిపించక మానదు. తమిళనాడులో 39 లోక్ సభ స్థానాలు ఉంటే.. గత ఎన్నికల్లో డీఎంకే 39స్థానాలకు పోటీ చేస్తే.. 38 స్థానాల్లో డీఎంకే కూటమి విజయం సాధించింది. ఇందులో డీఎంకే 20 చోట్ల పోటీ చేసి ఇరవై స్థానాల్ని సొంతం చేసుకుంటే.. కాంగ్రెస్ మాత్రం 9స్థానాలు కేటాయిస్తే..ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది.

నిజానికి కాంగ్రెస్ గెలుపు మొత్తం స్టాలిన్ చుట్టూ తిరిగిందని చెప్పక తప్పదు. విపక్షం బలంగా లేకపోవటంతో.. స్టాలిన్ కు కాన్ఫిడెన్సు భారీగా పెరిగినట్లుగా కనిపిస్తోంది. అందుకే.. బలాన్ని మరింత పెంచుకోవటానికి వీలుగా తాజా ప్రకటన చేశారని చెబుతున్నారు. మొన్నటికి మొన్న భయ్యా అంటూ రాహుల్ ను హగ్ చేసుకున్న స్టాలిన్.. అంతలోనే.. ఎన్నికలకు కాస్త ముందుగా తీసుకున్న నిర్ణయం షాకిచ్చేలా మారిందన్న మాట వినిపిస్తోంది. మరి.. స్టాలిన్ వ్యాఖ్యలపై రాహుల్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.