Begin typing your search above and press return to search.

మోదీ కరుణ...ఠాక్రేను గండం నుంచి తప్పించింది!

By:  Tupaki Desk   |   30 April 2020 4:41 PM GMT
మోదీ కరుణ...ఠాక్రేను గండం నుంచి తప్పించింది!
X
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి.... అంతలోనే పదవీ గండం గట్టున నిలబడ్డ శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఎట్టకేలకు ఆ గండం నుంచి గట్టెక్కేశారు. మహారాష్ట్ర శాసనమండలి ఖాళీలకు ఎన్నికలు జరపాలంటూ ఎన్నికల సంఘానికి గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ లేఖ రాశారు. అంతేకాకుండా వీలయినంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కూడా గవర్నర్ ఎన్నికల సంఘాన్ని తన లేఖలో ఆదేశించారు. మొత్తంగా ఉద్ధవ్ ను గండం నుంచి గట్టెక్కించే పనిని త్వరితగతిన పూర్తి చేయాలని ఈ లేఖలో గవర్నర్ ఈసీని కోరినట్టుగా భావించక తప్పదన్న భావన వ్యక్తమవుతోంది. మండలి ఎన్నికలు పూర్తి కాగానే... మే 28లోగా తాను ఏదో ఒక చట్టసభలో సభ్యుడిగా ఉండి తీరాలన్న నిబంధనను దిగ్విజయంగా పూర్తి చేయనున్న ఠాక్రే ఇక ఐదేళ్ల కాల సీఎం కుర్చీలో దిలాసాగానే కూర్చోవచ్చన్న మాట.

అయితే ఇలా ఉన్నట్టుండి ఇలా ఎన్నిక సంఘానికి మండలి ఎన్నికలు నిర్వహించమని గవర్నర్ లేఖ రాసేందుకు చాలా తతంగమే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే... తాను సీఎం అయ్యే సమయానికి ఏ సభలో కూడా సభ్యుడిగా లేని ఠాక్రే... మండలిలో సభ్యుడిగా ఎన్నికవ్వాలని భావించారు. అయితే బీజేపీతో అప్పటిదాకా కొనసాగిన స్నేహ బంధాన్ని కాదని.. కాంగ్రెస్, ఎన్సీపీతో జత కట్టిన నేపథ్యంలో బీజేపీకే చెందిన గవర్నర్ కోషియారీ... ఠాక్రే మండలి సభ్యత్వానికి అంతగా స్పందించలేదు. ఈలోగా ఆరు నెలల గడువు పరుగులు పెడుతూ వస్తోంది. ఒకానొక దశలో ఠాక్రేనను గడువులోగా మండలిలో సభ్యత్వం దొరకదని, ఆయన సీఎం పదవికి రాజీనామా చేయక తప్పదన్న వాదనలూ వినిపించాయి.

అయితే తన చివరి యత్నంగా బుధవారం నాడు ఠాక్రే... నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. తానున్న విపత్కర పరిస్థితిని వివరించారు. మహారాష్ట్రలో కరోనా విలయతాండవాన్ని వివరించారు. ఇలాంటి విపత్తులో రాజకీయ సంక్షోభం తలెత్తితే... రాష్ట్రం సర్వ నాశనం అవుతుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. అన్నీ ఆలోచించి తాను శాసనమండలికి ఎన్నికయ్యేలా చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు. ఈ ఫోన్ కాల్ ను మోదీని ఠాక్రే శరణువేడినట్టుగా విశ్లేషణలు వెలువడ్డాయి. ఠాక్రే వినతికి సానుకూలంగా స్పందించిన మోదీ... గవర్నర్ ద్వారా మండలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆ వెంటనే గవర్నర్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారని తెలుస్తోంది. మొత్తంగా తనను కాపాడమంటూ ఠాక్రే చేసిన విన్నపానికి మోదీ సానుకూలంగా స్పందించడంతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తప్పడంతో పాటుగా ఠాక్రే గండం నుంచి గట్టెక్కారన్న మాట.