Begin typing your search above and press return to search.

పోలవరం ఆపాల్సిందే.. ఏపీకి షాక్

By:  Tupaki Desk   |   3 July 2019 11:39 AM GMT
పోలవరం ఆపాల్సిందే.. ఏపీకి షాక్
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ తగిలింది. తాజాగా ఏపీకి పొరుగు రాష్ట్రమైన ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్.. ప్రధానికి లేఖ రాశారు. ఏపీ ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే నిలుపుదల చేయించాలని లేఖలో కోరారు. ఈ పరిణామం పోలవరాన్ని పూర్తి చేయాలన్నజగన్ సంకల్పానికి విఘాతంగా మారింది.

ఒడిషా ప్రభుత్వం ఆది నుంచి తమ గిరిజన గ్రామాలు, విస్తారమైన అడవి ముంపునకు గురవుతోందని.. పోలవరం ప్రాజెక్టును ఆపాలని సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలు చేసింది. గతవారమే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని సమస్యలను క్లియర్ చేసింది. అయితే ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. తాజాగా ఒడిషా సీఎం ప్రధాని మోడీకి ఈ ప్రాజెక్టును ఆపించాలని లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఒడిషాకు చాలా నష్టం వాటిల్లుతుందని.. మల్కాన్ గిరి జిల్లాలోని గిరిజన గ్రామాలు, సారవంతమైన వేలాది ఎకరాల వ్యవసాయ భూములు.. పెద్ద మొత్తంలో అటవీప్రాంతం మునిగిపోతుందని తన లేఖలో ఒడిషా సీఎం ఫిర్యాదు చేశారు.

ఈ ప్రాజెక్ట్ డిజైన్ ఒడిషాకు నష్టంగా మారిందని.. ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో బహిరంగ విచారణ కూడా చేయలేదని.. గిరిజనుల జీవితాలను ప్రభావితం చేసే ఈ ప్రాజెక్టు విషయంలో వారికి న్యాయం చేశాకే ముందుకెళ్లాలని ఒడిషా సీఎం సూచించారు.

అయితే పోలవరం మాత్రం గోదావరిపైనే అతిపెద్ద ప్రాజెక్ట్ కానుంది. ఇది ఏపీ సాగు, తాగునీటి అవసరాలు మొత్తం తీర్చే అతిపెద్ద ప్రాజెక్టు కానుంది. అంతేకాదు లక్షల ఎకరాల సాగునీరు, 960 మెగావాట్ల జలవిద్యుత్ కూడా అందించే ప్రాజెక్టు కావడంతో జగన్ ప్రభుత్వం దీన్ని వేగంగా పూర్తి చేయాలని సంకల్పించింది. మరి ఒడిషా అభ్యంతరాలను జగన్ ప్రభుత్వం ఎలా పరిస్కరిస్తుందన్నది ఆసక్తిగా మారింది.