Begin typing your search above and press return to search.

షాకిచ్చిన సీఎం.. విస్మయ మృతి కేసులో భర్తను ఉద్యోగం నుంచి తొలగించారు

By:  Tupaki Desk   |   8 Aug 2021 4:21 AM GMT
షాకిచ్చిన సీఎం.. విస్మయ మృతి కేసులో భర్తను ఉద్యోగం నుంచి తొలగించారు
X
కేరళ రాష్ట్రంలో పెను సంచలనంగా మారిన విస్మయ మృతి కేసుకు సంబంధించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. భార్య మరణంలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త కమ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా వ్యవహరిస్తున్న విస్మయ భర్త కిరణ్ కుమార్ ను ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మాంచి ఉద్యోగంలో ఉంటూ భారీగా కట్నం తెచ్చిన భార్యను మరింత కట్నం తీసుకురావాలంటూ దారుణంగా వేధింపులకు గురి చేయటం.. అనుమానాస్పద రీతిలో బాత్రూం వద్ద మరణించిన విస్మయ ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన 30 ఏళ్ల కిరణ్ కుమార్ మోటార్ వెహికిల్స్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్నారు. అతడికి కడక్కల్ కు చెందిన 23 ఏళ్ల విస్మయ నాయర్ ను ఇచ్చి పెళ్లి చేశారు. వివాహ వేళలో కట్నంగా 800 గ్రాముల బంగారంతో పాటు ఒక ఎకరం ఖరీదైన పొలం.. లగ్జరీ కారును అప్పజెప్పారు. వీటితో ఏ మాత్రం సంత్రప్తి పడని అతడు.. అదనపు కట్నం కోసం వేధించటం షురూ చేశాడు.

భర్త వేధింపులను తట్టుకోలేని విస్మయ.. తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఇంట్లోని వారికి పంపించింది. మరింత నగదు కావాలంటూ ఆమెను శారీరకంగా.. మానసికంగా వేధించటం మొదలు పెట్టాడు. ఈ వేధింపుల్ని తట్టుకోలేని విస్మయ.. తనను ఇబ్బంది పెడుతున్న భర్త వైనానికి సంబంధించిన ఫోటోల్ని పుట్టింటి వారికి పంపింది. ఇదిలా ఉంటే.. వాష్ రూపంలో మరణించినట్లుగా గుర్తించారు. దీంతో.. అత్తింటివారే తమ బిడ్డను బలి తీసుకున్నారంటూ విస్మయ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. కేరళలో వరకట్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. దీని నిర్మూలన దిశగా ఆందోళనలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలోనూ భారీ చర్చకు తెర తీసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సేకరించిన సమాచారం.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కిరణ్ వాంగ్మూలాన్ని సేకరించిన అధికారులు.. అతడు సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నట్లుగా గుర్తించారు. అతడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరిగింది. తాజాగా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా స్పందించి.. కిరణ్ ను ఉద్యోగ బాధ్యతల్ని తప్పించి.. అతడ్ని సస్పెండ్ చేశారు.