Begin typing your search above and press return to search.

ప్రభుత్వ పాఠశాలలపై సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   11 March 2020 10:50 AM GMT
ప్రభుత్వ పాఠశాలలపై సీఎం జగన్ మరో కీలక నిర్ణయం
X
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ విధానాన్ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమం, విద్యార్థులకు కిట్లు వంటివి నిర్ణయాలు తీసుకోగా ఇప్పుడు తాజాగా ప్రభుత్వ పాఠశాలలన్నీ డిజిటలైజ్ చేయాలని జగన్ భావిస్తున్నారు. ఆ మేరకు మంత్రివర్గంలో నిర్ణయం కూడా తీసుకున్నారని తెలుస్తోంది.

జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్దతో పాటు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావాలని, పేదలందరికీ చదువు భారం కారాదనే ఉద్దేశంతో సీఎం జగన్ చర్యలు చేపట్టారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వ పాఠశాలలన్నింటిలోనూ స్మార్ట్ టీవీలు అమర్చి డిజిటల్ విద్య అమలు చేయాలనే విషయమై చర్చించారంట. విద్యాశాఖ అధికారులతో మంగళవారం తన కార్యాలయం లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సాధ్యసాధ్యాలపై చర్చించారని సమాచారం. రాష్ట్రంలోని 15,715 పాఠశాలల పునరుద్ధరణ కు చర్యలు చేపట్టారు.

పాఠశాలలను బాగు చేస్తేనే డిజిటలైజేషన్ విధానం అమలుచేసి విద్యార్థులకు అత్యాధునిక పరికరాలతో విద్య అందించాలనే ఉద్దేశంతో స్మార్ట్ టీవీలు పాఠశాలలకు అందించనున్నారు. స్మార్ట్ నాణ్యమైనవి, మన్నిక గల వాటిని ఎంపిక చేసి విద్యా సంవత్సరం పున:ప్రారంభంలోపు ఏర్పాటుచేయాలని జగన్ సంబంధిత అధికారులు ఆదేశించారు. అదే విధంగా 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అమలు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్దతో పాటు పలు కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా కానుకలోని వస్తువులను జగన్ నిశితంగా పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆ కానుకలో మూడు జతల యూనిఫాం, పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలు, బూట్లు, టై, బెల్టులు ఉన్నాయా లేవా అని పరిశీలించారు. కానుకలను వచ్చే విద్యా సంవత్సరంలోపు అన్ని సిద్ధం చేయాలని సూచించారు. ఇంకా పాఠశాలల్లో విద్యార్థులకు మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు అందుబాటు లో ఉంచాలని, జగనన్న గోరుముద్దలో నాణ్యంగా భోజనం అందించాలని ఆదేశించారు.