Begin typing your search above and press return to search.

సీఎం మరో సంచలన నిర్ణయం .... రిపబ్లిక్ డే వేడుకలు ఎక్కడంటే ?

By:  Tupaki Desk   |   7 Jan 2020 5:28 AM GMT
సీఎం మరో సంచలన నిర్ణయం .... రిపబ్లిక్ డే వేడుకలు ఎక్కడంటే ?
X
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఏపీ సర్కార్ మూడు రాజధానుల నిర్మాణం పై వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చే అవాంతరాలని దాటుకుంటూ ముందుకు పోతుంది. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ, బీసీజీ రిపోర్ట్ రాజధాని వికేంద్రీకరణకు అనుకూలంగా నివేదిక ఇవ్వగా.. ఈ రెండు రిపోర్టులను హైపవర్ కమిటీ విశ్లేషించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇకపోతే మూడు రాజధానులపై ప్రకటన చేయడం కోసం ఈ నెల 20 లేదా 21న అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలలో చర్చ నడుస్తుంది.

విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న జగన్ సర్కార్... ఆ దిశగా కసరత్తును ముమ్మరం చేసింది. విడతల వారీగా సచివాలయాన్ని తరలించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని సమాచారం. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా ముందుకెళ్లాలని జగన్ సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖలోని మిలీనియం టవర్స్‌లో సచివాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 20 నుంచే మిలీనియం టవర్స్‌లో సచివాలయం ఏర్పాటు అవుతుందని.. దీనికి త్వరలోనే కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్సు ఉందని సమాచారం. అలాగే కీలక శాఖలని అక్కడికి తరలించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు సైతం విశాఖ లో జరపాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అంతకుముందే విశాఖను ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఏర్పాటు చేసేందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఇక అమరావతి లోని రాజధాని ని ఉంచాలంటూ అమరావతి ప్రాంత ప్రజలు గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.