Begin typing your search above and press return to search.

అమ్మ ఒడి పై జగన్ సంచలన నిర్ణయం..సర్వత్రా హర్షం

By:  Tupaki Desk   |   19 Jun 2019 5:59 PM GMT
అమ్మ ఒడి పై జగన్ సంచలన నిర్ణయం..సర్వత్రా హర్షం
X
వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో తనదైన శైలిని చూపిస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే దిశగా సాగుతున్న జగన్... అందులో కీలకమైన అమ్మ ఒడికి సంబంధించి జనంలో ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లులకే ఈ పథకాన్ని వర్తింపజేయాలని జగన్ నిజంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. జగన్ సీఎం కాగానే... అమ్మ ఒడి ద్వారా వచ్చే సొమ్ముతో తమ పాఠశాలల్లో విద్యనభ్యసించవచ్చని - తమ పాఠశాలల్లో చేరినా అమ్మ ఒఢికి అర్హులేనంటూ పలు ప్రైవేట్ పాఠశాలలు ఏకంగా బోర్డులే పెట్టేశాయి. అమ్మ ఒఢిని ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపజేస్తే... సర్కారీ విద్యా వ్యవస్థ కుదేలవుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం నుంచి దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కేవలం ప్రభుత్వ పాఠశాలలకు పంపే పిల్లల తల్లులకే ఈ పథకాన్ని వర్తింపజేయాలని జగన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఈ ప్రకటన ధనార్జనే లక్ష్యంగా సాగుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలకు శరాఘాతమేనని చెప్పాలి. అంతేకాకుండా ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరడం ద్వారా అంతే స్థాయిలో ఉపాధ్యాయుల పోస్టు భర్తీ కూడా ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. జగన్ సర్కారు నుంచి ఈ ప్రకటన రాగానే... పలు వర్గాల నుంచి హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. జగన్ సర్కారు నిర్ణయంతో ప్రభుత్వ విద్యకు మంచి కాలం వచ్చినట్టేనని ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు.