Begin typing your search above and press return to search.

తమిళనాడులో సీఎం వైఎస్ జగన్ భారీ కటౌట్ .. అసలు సంగతేంటి ?

By:  Tupaki Desk   |   22 Feb 2021 12:30 PM GMT
తమిళనాడులో సీఎం వైఎస్ జగన్ భారీ కటౌట్ .. అసలు సంగతేంటి ?
X
తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోలాహాలం తీవ్రస్థాయిలో ఉంది. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా విజయమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇకపోతే ఈ ఎన్నికలో అధికార అన్నాడీఎంకే , బీజేపీ తో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగనుంది. ఇక మరోవైపు డీఎంకే ఎప్పటిలాగే కాంగ్రెస్ తో దోస్తీ కట్టనుంది.

కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీథి మయ్యం.. మజ్లిస్‌తో పొత్తు కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. త్వరలో ఈ రెండు పార్టీల నేతల మధ్య కీలక భేటీ ఏర్పాటు కానుంది. ప్రధాన పోటీ మాత్రం ఏఐఏడీఎంకే-డీఎంకేల మధ్యే ఉంటుంది అనడంలో సందేహమే లేదు. ఇక ఈ మధ్య శశికళ కూడా జైలు నుండి విడుదలై చెన్నై కి చేరుకోవడంతో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది సమీకరణాలు మారే అవకాశం కూడా లేకపోలేదు.

ఈ పరిణామాల మధ్య ఏపీ సీఎం వైఎస్ జగన్ కి చెందిన ఓ భారీ కటౌట్ తమిళనాడు వెలిసింది. తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, వైఎస్ జగన్‌‌ తో కూడిన ఆ కటౌట్ కాళ్లకురిచ్చి జిల్లా ఉలందరూర్ పేట లో ఏర్పాటు చేశారు. ఉలందుర్ పేటకు చెందిన ఏఐఏడీఎంకే శాసనసభ్యుడు కుమారగురు ఈ కటౌట్ ‌ను ఏర్పాటు చేశారు.

ఉలందుర్ పేటలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించ దలిచిన శ్రీవారి ఆలయం శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా పెట్టారు. కుమారగురు టీటీడీ బోర్డు సభ్యుడు. తన నియోజకవర్గంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడానికి ఆయన 3.98 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఆ స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఎడప్పాడి పళనిస్వామి కొద్దిసేపటి కిందటే భూమిపూజ చేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కుమారగురు సతీసమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పండితుల వేదమంత్రాల మధ్య వైభవంగా భూమిపూజ చేశారు. ఈ స్థలంలో వెంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు పద్మావతి అమ్మవారు, ఆండాళ్ అమ్మవారి ఉప ఆలయాలు కూడా నిర్మించనున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా పళనిస్వామితో పాటు వైఎస్ జగన్ భారీ కటౌట్‌ ను ఏర్పాటు చేయడం చర్చనీయాంశమౌతోంది.

అయితే , కుమారగురు టీటీడీ బోర్డు సభ్యుడు కావడం వల్లే వైఎస్ జగన్ కటౌట్ ఏర్పాటు చేశారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో తెలుగు ఓటర్లు కూడా పెద్దగా లేరట. ఏమైనా కూడా త్వరలో తమిళనాడు లో ఎన్నికలు జరగనున్న ఈ సమయంలో సీఎం జగన్ కటౌట్ ఏర్పాటుచేయడంతో దీనిపై విపరీతంగా చర్చ జరుగుతుంది.