Begin typing your search above and press return to search.

ఏపీలో పదవుల పందేరానికి జగన్ కసరత్తు

By:  Tupaki Desk   |   24 Aug 2020 5:30 PM GMT
ఏపీలో పదవుల పందేరానికి జగన్ కసరత్తు
X
ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీకి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కసరత్తులు చేస్తున్నారన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సింగిల్ విడతలో ఏకంగా 200 మేర పదవులను భర్తీ చేయనున్నారని, ఈ పదవులన్నీ కూడా బీసీల్లోని ఉప కులాలకు చెందిన వారికే దక్కనున్నాయన్న వార్తలు మరింత ఆసక్తి రేకెత్తించేవే. ఇప్పటికే ఈ దిశగా జగన్ తన కసరత్తును పూర్తి చేశారని, అతి త్వరలోనే ఈ పదవులన్నీ భర్తీ కానున్నాయని తెలుస్తోంది. బీసీల్లోని అన్ని ఉపకులాలకు ప్రత్యేకంగా కార్పోరేషన్లను ఏర్పాటు చేసి.. ఆయా కులాల వారి అభ్యున్నతికి కృషి చేయనున్నట్లుగా జగన్ ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయా కులాల కార్పోరేషన్లకు చైర్మన్లను, సభ్యులను నియమించే పనిని జగన్ దాదాపుగా పూర్తి చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

బీసీల్లోని ఆయా కులాల వారీగా ఏకంగా 54 కార్పోరేషన్లను ఏర్పాటు చేసేందుకు జగన్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ క్రమంలో సదరు కార్పోరేషన్లకు చైర్మన్లతో పాటుగా సభ్యులను కూడా నియమించాల్సి ఉంది. ఒక్కో కార్పోరేషన్ కు ఓ చైర్ పర్సన్ తో పాటు ఏడు నుంచి తొమ్మిది మంది సభ్యులను కూడా సదరు కార్పోరేషన్లలో నియమించాలని జగన్ భావిస్తున్నారట. ఈ క్రమంలో మొత్తం 54 కార్పోరేషన్లకు సంబంధించి తక్కువలో తక్కువ 200 మందికి పదవులు దక్కే అవకాశాలున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే... ఏపీలో ఒకే విడతలో భారీ ఎత్తున నేతలకు నామినేటెడ్ పదవులు దక్కడం ఖాయమే.

బీసీలకు చెందిన ఈ కార్పోరేషన్ల భర్తీకి జగన్ సిఫారసులను ఎంతమాత్రం పట్టించుకోవడం లేదట. పార్టీకి నిస్వార్థంగా సేవలు అందించిన వారికే పదవులు దక్కేలా జగన్ కసరత్తులు చేస్తున్నారట. ఇందుకోసం పార్టీకి చెందిన ఓ కీలక నేత ఆధ్వర్యంలో కొన్ని రోజుల క్రితం మొదలైన స్క్రీనింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి అయిపోయిందని తెలుస్తోంది. అయితే పార్టీలో ఓ మోస్తరు గుర్తింపు కలిగిన నేతలు... ఈ కార్పోకేషన్ల చైర్మన్లు, లేదంటే సభ్యుల పదవుల కోసం తమకు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నేతల ద్వారా సిఫారసులు చేయించుకున్నారట. అయితే ఈ తరహా సిఫారసులను అన్నింటినీ పక్కనపెట్టేసిన జగన్... పార్టీ కోసం అలుపెరగకుండా పనిచేసిన నేతలకు మాత్రమే పదవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఫలితంగా సిఫారసులు అన్నీ చెత్తబుట్ట దాఖలేనన్న వార్తలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.