Begin typing your search above and press return to search.

సీఎం టు సీపీ..

By:  Tupaki Desk   |   22 March 2021 7:30 AM GMT
సీఎం టు సీపీ..
X
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ తిరుగులేని శక్తిగా మారింది. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఇక ఏ ఎన్నిక జరిగినా విజయం తమదే అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నారు. అయితే ఈ గెలుపుకు గల కారణం ఏమిటి..? దేవాలయాలపై దాడులు.. ప్రతిపక్షాల విమర్శలు ఎన్ని చేసినా వైసీపీ ఇంతలా ప్రజల్లోకి వెళ్లడానికి కారణం ఏమిటి..? జగన్ ను ఏపీ ప్రజలు ఎలా నమ్ముతున్నారు..? అంటే దీనికి ఒక్కటే సమాధానం.. అదే.. సీఎం టు సీపీ..

సీఎం టు సీపీ.. అంటే ‘చీఫ్ మినిస్టర్ టు కామన్ పీపుల్’.. అనే సిస్టమ్ ను ముఖ్యమంత్రి జగన్ పాటిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 అధికారంలోకి వచ్చిన జగన్ మొదటి నుంచి సంక్షేమ పథకాలను నమ్ముకున్నారు. పేద ప్రజలకు తాను ప్రవేశపెట్టే పథకాలు నేరుగా అందడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఇందుకు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచనను పాటించిన జగన్ ఈ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు సమాచారం. అయితే ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటి వరకు గ్రామస్థాయిలో వాలంటీర్లు ఉండి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారు. ఈ వ్యవస్థను మండల స్థాయిలో ఓ సూపర్ వైజర్ ను నియమించి దీనిని మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటి వరకు వాలంటీర్లకు రూ.5000 గౌరవ వేతనం అందిస్తున్నారు. మండలస్థాయిలో ఉన్నవారికి రూ.25,000 తో ఓ సూపర్ వైజర్ ను నియమించి మరింత పటిష్టంగా ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోనున్నారు.

అయితే కొందరు ఎమ్మెల్యేలు పార్టీలో ఉంటూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని స్థానిక నాయకులు సీఎంకు ఫీడ్ బ్యాక్ అందించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు సంక్షేమ పథకాల విషయంలో అవకాశం ఇవ్వకుండా కేవలం వాలంటీర్లకే బాధ్యతను అప్పగించనుంది. ఈ వాలంటీర్ల వ్యవస్థతో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ క్లీన్ స్వీప్ చేసిందని కొందరు ఫీడ్ బ్యాక్ అందించారు. దీంతో జగన్ ఎమ్మెల్యేలను కాకుండా వాలంటీర్లను నమ్ముకొని ముందుకు సాగనున్నారు. దీంతో సీఎం నేరుగా ప్రజలతో మమేకమై ఉన్నట్లుంటుందని భావిస్తున్నారు.