Begin typing your search above and press return to search.

అధికారలాంఛనాలతో కోడెల అంత్యక్రియలు.. జగన్ ఆదేశం

By:  Tupaki Desk   |   17 Sep 2019 8:18 AM GMT
అధికారలాంఛనాలతో కోడెల అంత్యక్రియలు.. జగన్ ఆదేశం
X
మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతదేహాన్ని ఈరోజు గుంటూరుతోపాటు కోడెల సొంత నియోజకవర్గాలు సత్తెనపల్లి, నరసారావుపేటలకు తీసుకొస్తున్నారు. బంధువులు, అభిమానులు, పార్టీ శ్రేణులు కడసారి చూసేందుకు వీలుగా ఈ ఏర్పాట్లు చేశారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సాయంత్రం వరకూ కోడెల భౌతిక ఖాయం ఉంచుతారు. అనంతరం రాత్రికి నర్సరావుపేటకు తరలిస్తారు. రేపు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కోడెల మరణంపై ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ తాజాగా కోడెల శివప్రసాద్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను జగన్ ఆదేశించారు.

టీడీపీ నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా ఏపీ సీఎం జగన్ మాత్రం కోడెల విషయంలో ఆయన హోదా, పరపతికి గౌరవం ఇస్తూ అధికారికంగా అంత్యక్రియలకు ఆదేశాలు ఇవ్వడం విశేషం. కోడెల 36 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యే, మంత్రి పదవులు చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు తొలి స్పీకర్ గా చేశారు. అందుకే కోడెల చేసిన సేవలకు గాను ఇప్పటికే సంతాపం ప్రకటించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తాజాగా ఆదేశాలిచ్చారు.

జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నరసారావుపేటలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అధికారికంగా నిర్వహించడంపై కోడెల కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో నర్సారావుపేటలో కోడెల అంత్యక్రియలు నిర్వహించనున్నారు.