Begin typing your search above and press return to search.

జగన్ దిగ్భ్రాంతి...మృతుల కుటుంబాలకు నష్టపరిహారం

By:  Tupaki Desk   |   29 Dec 2022 9:03 AM GMT
జగన్ దిగ్భ్రాంతి...మృతుల కుటుంబాలకు నష్టపరిహారం
X
కందుకూరులో జరిగిన చంద్రబాబు రోడ్ షో ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలు అయిన ఉదంతం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో గాయపడిన వారి విషయం ఆయన ఆరా తీసి సంతాపం ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ దుర్ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు, అలాగే, గాయపడిన వారికి 50 వేల రూపాయలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అధికారులు బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని ఆయన ఆదేశించారు.

ఇదిలా ఉండగా నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ రోడ్ షో కోసం కందుకూరు వచ్చిన ప్రతిపక్ష నేతను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. దాంతో జనం ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో ఒక కాలువలో పడి అక్కడికక్కడే అయిదురుగు మరణించారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చనిపోయారు.

ఇక ఈ దుర్ఘటన మీద దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేల రూపాయలు అందజేస్తామని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ దుర్ఘటన తనను బాధించిందని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

మరో వైపు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా ఈ దుర్ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. ఇదిలా ఉండగా మృతుల కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గత రాత్రి 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే బాధిత కుటుంబానికి తెలుగుదేశం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు ప్రకటించడమే కాదు సభను కూడా రద్దు చేసుకున్నారు.

మరో వైపు ఈ ఘటన ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది. గతంలో ఎపుడూ కూడా ఇలా జరగలేదు. రాజకీయ పార్టీల సభలకు వస్తూ యాక్సిడెంట్ అయి మరణించిన ఉదంతాలు ఉన్నాయి కానీ సభకు వచ్చి తొక్కిసలాటలో ప్రాణాలు వదలడం అంటే దారుణమే అంటున్నారు. దీంతో దేశమంతా ఈ ఘటన కలకలం రేపుతోంది. మృతులకు అంతా సంతాపం తెలియచేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.