Begin typing your search above and press return to search.

జగన్‌ దూకుడు.. మరో కీలక నేతపై సస్పెన్షన్‌ వేటు!

By:  Tupaki Desk   |   19 Oct 2022 8:19 AM GMT
జగన్‌ దూకుడు.. మరో కీలక నేతపై సస్పెన్షన్‌ వేటు!
X
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు విజయ ఢంకా మోగించాలని వైఎస్సార్సీపీ ఉవ్విళ్లూరుతోంది. లెక్కకు మిక్కిలిగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను విజయ తీరాలకు చేరుస్తాయని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి చోటా నేతల వరకు గట్టిగా నమ్ముతున్నారు. 175కి 175 అసెంబ్లీ సీట్లు సాధించాలని వైఎస్‌ జగన్‌.. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు, కార్యకర్తలకు ఉద్భోదిస్తున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఇంటి ఇంటికీ తిరుగుతున్నారు.

ఆయా నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ఈ మూడేళ్లలో ప్రభుత్వం చేసిన మేలును ఎమ్మెల్యేలు వివరిస్తున్నారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను కూడా ప్రజల చేతుల్లో పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడే వారి పైన చర్యలు మొదలు పెట్టారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై వేటు వేస్తున్నారు. ఇప్పటికే ఇలా నర్సాపురం మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకట రమణను సీఎం జగన్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన దోవారి ఏసు దాస్‌ (డీవై దాస్‌)ను పార్టీ నుంచి బహిష్కరించారు. కాగా డీవై దాస్‌ 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2014లో టీడీపీ ఆయనకు టికెట్‌ ఇవ్వకుండా వర్ల రామయ్యకు ఇచ్చింది. దీంతో వైసీపీ తరఫున పోటీ చేసిన ఉప్పులేటి కల్పన నెగ్గారు. ఆ తర్వాత ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మళ్లీ 2019 ఎన్నికల తర్వాత డీవై దాస్‌ టీడీపీని వీడి వైసీపీలో చేరారు.

అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు డీవై దాస్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత, సీఎం జగన్‌ ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కాగా 2019 ఎన్నికల్లో పామర్రు నుంచి వైసీపీ అభ్యర్థి కైలే అనిల్‌ కుమార్‌ గెలుపొందారు. టీడీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పోటీ చేశారు. 2014 ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీనే గెలిచింది. ఉప్పులేటి కల్పన వైసీపీ నుంచి గెలిచి ఆ తరువాత టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే.

ఇక, వచ్చే ఎన్నికల కోసం ఇక్కడ నుంచి టీడీపీ ఇప్పటికే అభ్యర్థిని ఆ పార్టీ ఖరారు చేసింది. పామర్రు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా వర్ల రామయ్య తనయుడు కుమార్‌ రాజా నియమితులయ్యారు. వైసీపీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ పోటీ చేసే చాన్స్‌ ఉందని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.