Begin typing your search above and press return to search.

ఫేక్ వాయిస్ తో సీఎంవోకే సురుకు పుట్టించారే!

By:  Tupaki Desk   |   15 Oct 2019 6:40 AM GMT
ఫేక్ వాయిస్ తో సీఎంవోకే సురుకు పుట్టించారే!
X
అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. కొత్త సంచలనాలకు కేంద్రంగా మారటం.. టార్గెట్ చేసి బద్నాం చేసే ధోరణి అంతకంతకూ పెరుతోంది. ఇదేదో సామాన్యుడి కాకుండా ఏకంగా ఒక రాష్ట్ర సీఎంవోకే ఇలాంటి పరిస్థితి ఎదురుకావటం చూస్తే.. ఇప్పుడెలాంటి పరిస్థితులు ఉన్నాయో చెప్పకనే చెప్పినట్లు అవుతుందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో సంచలనం కోసం సీఎంవో హెల్ప్ లైన్ కు ఒక సామాన్యుడు ఫోన్ చేసి.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా తీరుపై తీవ్ర విమర్శలు చేసినట్లుగా చెబుతూ ఒక ఆడియో క్లిప్ ఒకటి వైరల్ గా మారింది.

ఆర్టీసీ సమ్మె.. స్కూళ్లకు సెలవుల పొడిగింపు అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును తప్పుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేసిన వైనం ఆడియో క్లిప్ లో ఉంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావటమే కాదు.. కొన్ని మీడియా సంస్థల్లో వార్తల రూపంలోనూ వచ్చేసింది. దీంతో.. సీఎంవో ఉలిక్కిపడింది. తమకు అలాంటి ఫోన్ కాల్ రాకపోగా.. సీఎంవో ప్రతిష్టను దెబ్బ తీసేలా జరుగుతున్న ప్రయత్నాలపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఒక సామాన్యుడు సీఎంవోకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి పని తీరుపై విమర్శలు గుప్పించటం.. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయటంతో పాటు.. ఇష్యూను సీరియస్ గా తీసుకోవాలనుకుంటున్నారు. తమ పేరుతో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ ఫేక్ అన్నది తేల్చారు. ఇలాంటివి చేయటంపై ఆగ్రహంతో ఉన్న సీఎంవో.. ఇందుకు బాధ్యుల్ని గుర్తించాలని ఆదేశించినట్లు చెబుతున్నారు.

ఇప్పటికే ఈ ఫేక్ ఆడియో క్లిప్ మీద తెలంగాణ సీఎంవో ట్విట్టర్ వేదికగా స్పష్టత ఇవ్వటంతో పాటు.. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. మీడియాలో వచ్చిన వార్తలు తప్పన్న విషయాన్ని ఆయా మీడియా సంస్థలకు సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. ఈ ఫేక్ ఆడియో క్లిప్ నకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్న ఆదేశాల్ని ఇచ్చినట్లు చెబుతున్నారు.