Begin typing your search above and press return to search.

బొగ్గు కొరత .. విద్యుత్ సంక్షోభం : దాన్ని అమ్మితే చర్యలు తప్పవన్న కేంద్రం !

By:  Tupaki Desk   |   12 Oct 2021 4:30 PM GMT
బొగ్గు కొరత .. విద్యుత్ సంక్షోభం : దాన్ని  అమ్మితే చర్యలు తప్పవన్న కేంద్రం !
X
దేశంలోని వివిధ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత వల్ల విద్యుత్ కొరత ఏర్పడనుందని దేశంలోని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యుత్‌ కొరతపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మిగులు విద్యుత్ ఉత్పత్తి ఉన్న రాష్ట్రాలు, కొరత ఉన్న రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ స్టేషన్ల వద్ద ఉన్న 15 శాతం అన్ అలకేటెడ్ కోటా నుంచి విద్యుత్ వాడుకోవాలని విన్నవించింది. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల నుంచి ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగింది.కొన్ని రాష్ట్రాలు ప్రజలకు విద్యుత్ కోతలు పెడుతూ బయట రాష్ట్రాలకు పవర్ అమ్ముతున్నారు.

ఈ క్రమంలో కేంద్రం మిగులు కరెంట్‌ను పవర్ ఎక్స్చేంజిలలో అమ్మితే ఆ రాష్ట్రాల కేటాయింపులు తగ్గించేస్తామని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ శాఖ మంగళవారం రాష్ట్రాలకు లేఖ రాసింది. కేంద్రం వద్ద మూడు నాలుగు రోజులకు మినహ బొగ్గు నిల్వలు లేవని దీంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడబోతుందంటూ పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. ముఖ్యంగా బొగ్గు కొరతపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రానికి లేఖ రాశారు. ఢిల్లీలో విద్యుత్ సరఫరా చేసే కేంద్రాలకు బొగ్గు పంపిణీ చేయాలని తన లేఖలో ఆయన కోరారు.

అయితే బొగ్గు కొరత పై కేంద్రమంత్రి విద్యుత్ శాఖ మంత్రి ఆకే సింగ్ స్పందించారు. దేశంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత ఏర్పడడంతో విద్యుత్‌ సంక్షోభం ఎదుర్కోబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. విద్యుత్‌ సంక్షోభంపై అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని స్పష్టం చేశారు. కేవలం గెయిల్, డిస్కం సంస్థల మధ్య సమాచారలోపం వల్లే ఇలాంటివి ఏర్పడినట్లు పేర్కొన్నారు. దేశరాజధాని దిల్లీ, మరికొన్ని రాష్ట్రాల్లో విద్యుత్‌ సరఫరాకు ప్రమాదం ఏర్పడనున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విపక్షాలే వదంతులు సృష్టిస్తూ.. రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అయితే ఈ ప్రకటనపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మండిపడ్డారు.

ఏప్రిల్, మే నెలల్లో దేశంలో క్సిజన్ కొరత ఏర్పడిన సమయంలో కూడా కేంద్రం ఇలాగే మాట్లాడిందని సిసోడియా విమర్శించారు. అప్పుడు ఆక్సిజన్ కొరత లేదన్నారు. ఇప్పుడు బొగ్గు కొరత లేదంటున్నారు. మా ముఖ్యమంత్రి లేఖ రాసుండకూడదంటూ ఈ సంక్షోభాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ సిసోడియా ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు గుజరాత్, పంజాబ్. రాజస్థాన్. ఢిల్లీ, తమిళనాడు తదితర రాష్ట్రాలు బ్లాకవుట్ ఆందోళనలు లేవనెత్తాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేసే కేంద్రాలకు బొగ్గు సరఫరా జరిగేలా చూడాలని కోరారు. ఈ బొగ్గు కొరత కారణంగా బిహార్, రాజస్థాన్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రోజుకు 14 గంటలపాటు కరెంటు కోతలు విధిస్తున్నారు. అయితే దీనికి కారణం బొగ్గు కొరత కాదని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది.