Begin typing your search above and press return to search.

క్యూలో నిలుచున్న వారికి ‘కోక్’ తోఫా

By:  Tupaki Desk   |   15 Nov 2016 4:38 AM GMT
క్యూలో నిలుచున్న వారికి ‘కోక్’ తోఫా
X
పరిస్థితుల్ని తమకు తగ్గట్లుగా మార్చుకునేటోడే మొనగాడు. ప్రతికూలాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే తెలివితేటలు కొందరికి మాత్రమే సాధ్యం. సరిగ్గా అలాంటి తెలివితేటల్నే ప్రదర్శిస్తోంది ప్రముఖ శీతలపానీయాల కంపెనీ కోకోకోలా. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చిల్లర నోట్ల కోసం.. తమ వద్ద ఉన్న పెద్దనోట్లను కొత్త నోట్లకు మార్చుకునేందుకు బ్యాంకులకు.. ఏటీఎం సెంటర్లకు వస్తున్న ప్రజలు భారీ క్యూలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

గంటల కొద్దీ క్యూలో నిలుచోవటం ప్రజల్ని తీవ్రఇక్కట్లకు గురి చేస్తోంది. ఈ నేపథ్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని కోకోకోలా కంపెనీ నిర్ణయించింది. డబ్బుల కోసం బ్యాంకుల వద్ద.. ఏటీఎంల వద్ద క్యూలలో నిలుచునే ప్రజల్ని సేద తీర్చేందుకు వీలుగా తమ కోకోకోలా కంపెనీ తమ శీతల పానీయమైన ‘‘కోక్’’ను క్యూలో ఉన్న వారికి ఉచితంగా పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని చోట్ల కోక్ బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేస్తూ ఆకర్షిస్తోంది.

ఏపీలోని నెల్లూరు జిల్లా వేదాయపాలెం సెంటర్ లోని ఎస్ బీఐ దగ్గర కోకోకోలా ప్రతినిధులు కోక్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఎర్రటి ఎండకు చిర్రెత్తుతున్నవేళ.. ఎంతకూ తగ్గని క్యూ లైన్ లో నిలుచునే ఓపిక లేక.. సహనం నశిస్తున్న వారికి ఈ కోక్ తోఫా అలరిస్తోంది. డబ్బులు విత్ డ్రా చేయటం కోసం వచ్చిన ప్రజలు.. గంటల తరబడి నిలుచోవటంతో అలిసిపోతున్నారని.. అందుకే ప్రజలకు సేవ చేయటంలో భాగంగా కోక్ బాటిళ్లను తాము పంపిణీ చేస్తున్నట్లుగా సదరు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే రీతిలో కోక్ బాటిళ్లను ఉచితంగా అందిస్తామని చెబుతున్నారు. పరిస్థితి ఎలాంటిదైనా తమకు తగ్గట్లుగా మలుచుకునే నేర్పు వ్యాపారులకు మించి మరెవరికీ ఉండదేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/