Begin typing your search above and press return to search.

కోడిపందాలు.. సంస్కృతోత్సవం..

By:  Tupaki Desk   |   14 Jan 2019 4:56 AM GMT
కోడిపందాలు.. సంస్కృతోత్సవం..
X
అటు జల్లికట్టు.. ఇటు కోడిపందాలు.. ఈ సంస్కృతోత్సవానికి సంక్రాంతి వేదికైంది. సంప్రదాయావాదులు, ప్రకృతి, జంతు ప్రేమికులు ఎంత అరిచి గోలపెట్టినా సరే మన సంస్కృతిలో భాగమైన పండుగలు, వాటితోపాటు వచ్చే సరదా ఆటలను జనం ప్రేమిస్తూనే ఉంటారు.. ఆడుతూనే ఉంటారు.

జల్లికట్టు సహా కోడిపందేల వల్ల లక్షలు బెట్టింగులు కాచి ఇల్లు గుల్ల అవుతుందని ఎంతమంది ఎన్ని కేసులు వేసినా.. పోలీసులు సీరియస్ అంటూ వార్నింగ్ లు ఇచ్చినా సరే ప్రజలు మాత్రం తమ సంప్రదాయ సంక్రాంతి ఆటలు ఆడుతూనే ఉన్నారు.

అప్పట్లో తమిళనాట జల్లికట్టుపై సుప్రీం కోర్టు నిషేధం విధించడం.. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో తమిళలు భగ్గుమన్నారు. ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖులు ఒక్కటై తమ సంప్రదాయ ఆటను విడవమని ఆడి కేంద్రానికి సవాల్ విసిరారు. ఇక్కడ సంప్రదాయాల కంటే సుప్రీం తీర్పులు, కేంద్ర పెత్తనాలు పనిచేయలేవు.

అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ .. హైదరాబాద్ శివారు సహా సెటిలర్లు ఎక్కువగా ఉన్న నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ - నల్గొండ - ఖమ్మం జిల్లాల్లోనూ కోడిపందేల జోరు కనిపిస్తోంది. ప్రభుత్వాలు, పోలీసులు ఆడకూడదని హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా ప్రజలు మాత్రం తమ సంప్రదాయ వినోదంలో పాలుపంచుకుంటున్నారు. కొన్ని తీర్పులు, నిర్ణయాల విషయంలో కేంద్రం, సుప్రీం ప్రజల ఇష్టానికే వదిలేస్తే మన సంస్కృతి పరిఢవిల్లుతుందని ప్రజానీకం సూచిస్తున్నారు. అప్పుడే మన పాత సంస్కృతి భావి తరాలకు అందించవచ్చని చెబుతున్నారు. మరి నిషేధం మాటున కోడిపందాలు ఎంత వరకు జరుగుతాయన్నది వేచిచూడాల్సిందే.