Begin typing your search above and press return to search.

కోస్తాలో కోడిపందేల కోలాహలం..బెట్టింగ్‌ల జోరు

By:  Tupaki Desk   |   14 Jan 2018 12:56 PM GMT
కోస్తాలో కోడిపందేల కోలాహలం..బెట్టింగ్‌ల జోరు
X
సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ. సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుకిది సమయం. కొత్త బట్టలు, అత్తారిల్లు, బావామరదళ్ళ సరసాలు - గొబ్బెమ్మలు - గంగిరెడ్లు - హరిదాసులు - పిండివంటలు - భోగిపళ్ళు.. ఇలా ఎన్నిరకాల సంప్రదాయాలున్నా సంక్రాంతి అంటే మొదటిగా గుర్తొచ్చేది కోడిపందాలే. దాదాపు రెండుమాసాల ముందు నుంచి ఈసారి కోడిపందాలకు అనుమతులుంటాయా లేదా.. మన ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారా.. తేరా.. పోలీసుల్ని పందాల జోలికి రాకుండా నిలువరిస్తారా.. లేదా.. అన్న చర్చలే ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో మొదల‌వుతాయి.

గోదావరి జిల్లాలు కోడిపందాలకు మెట్టినిల్లు లాంటిది. ఈ జిల్లాల్లోని భీమవరం - ఐ పోలవరం - ముమ్మిడివరం - పిఠా పురం - ఆకివీడు - ఉండి - నర్సాపురం - రామచంద్రాపురం - కత్తిపూడి వంటి ప్రాంతాలు కోడిపందాల్తో మారుమ్రోగిపోతాయి. అయితే ఉత్కంఠ వీడిన నేప‌థ్యంలో కోడి పందాలతో ఉభయ గోదావరి జిల్లాలు సంద‌డిగా మారాయి. శుక్రవారం నాటి సుప్రీం తీర్పు వెలువరించడానికి ముందే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడి పందేల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసేశారు. ఏటా జనవరి 13 - 14 - 15 తేదీల్లో నిర్వహించే కోడి పందేలు ఈ ఏడాది మాత్రం పండగ తేదీలకు అనుగుణంగా 14 - 15 - 16 తేదీల్లో నిర్వహిస్తున్నారు. భారీ బరులు నిర్వహించే ప్రాంతాల్లో రాత్రీ పగలు నిర్వహణకు వీలుగా ఫ్లడ్ లైట్లు ఏర్పాటుచేశారు.

ఇక పందేలు జరిగే ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న లాడ్జీలు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లన్నీ ఇప్పటికే హౌస్‌ఫుల్ అయిపోయాయి! రాష్ట్రం నలు మూలల నుండే కాక, విదేశాల నుండి సైతం అతిథులు గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలను తిలకించడానికి తరలివస్తున్నారు. ఇలా తరలివచ్చే వీవీఐపీల కోసం పందేల బరుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని చోట్ల కోడి పందేల నిర్వహణకు తాత్కాలిక స్టేడియం తరహాలో ఏర్పాట్లుచేశారు. షామియానాలు, తాత్కాలిక ప్రహరీ సైతం ఏర్పాటుచేయడం విశేషం. అలాగే కోడి పుంజుల బొమ్మలతో స్వాగత ద్వారాలు సైతం ఏర్పాటుచేశారు. కాగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో నివాసముంటున్న ఆంధ్రావారంతా తరలివస్తుండటంతో శుక్రవారం నుండి గోదావరి జిల్లాల్లో రోడ్లన్నీ రద్దీగా మారిపోయాయి. సంక్రాంతి పర్వదినానికి సొంత ఊర్లకు రావడం ఒక సంప్రదాయంగా మారిపోయిన నేపథ్యంలో ఈ ఏడాది పండగ రద్దీ మొదలయ్యింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో నివసించే వారంతా తరలివస్తున్న ఖరీదైన కార్లతో ఎక్కడికక్కడ రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది.

మ‌రోవైపు పేరుకు సంప్రదాయ కోడి పందేలు అని పేర్కొంటున్నప్పటికీ, పెద్ద ఎత్తున జూదాలు జరుగుతాయనడంలో ఎటువంటి సందేహంలేదు. కోడి పందేలకు తోడు పేకాట, గుండాట తదితర జూదాలు నిర్వహించడానికి వీలుగా పందేల బరులకు సమీపంలో ప్రత్యేక ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ జూదాల నిర్వహణ హక్కులను కొందరు నిర్వాహకులు లక్షల రూపాయలు చెల్లించి సొంతం చేసుకుంటున్నారు.

ఇదిలాఉండ‌గా...సంక్రాంతి కోడి పందేలు న్యాయ స్థానం తీర్పునకు లోబడే నిర్వహించుకోవాల్సివుందని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చిన రాజప్ప అన్నారు. కోర్టు ఉత్తర్వులకు లోబడే ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. రాజమహేంద్రవరం వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. సంక్రాంతి పండగను సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవడానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.