Begin typing your search above and press return to search.

అక్క‌డ బొద్దింక‌ల‌తో కోట్లు సంపాదిస్తున్నార‌ట!

By:  Tupaki Desk   |   6 Jun 2018 1:30 AM GMT
అక్క‌డ బొద్దింక‌ల‌తో  కోట్లు సంపాదిస్తున్నార‌ట!
X
కొన్ని పేర్లు విన్నంత‌నే చిరాకు ప‌డిపోతుంటారు. ఛీ.. ఛీ.. అంటూ అస‌హ్యంగా ముఖం పెడ‌తారు. అలాంటి పేర్ల జాబితాలో నిలుస్తుంది బొద్దింక‌. ఇంట్లో ఎక్క‌డైనా బొద్దింక క‌నిపిస్తే చాలు.. ఆగ‌మాగ‌మ‌య్యే వాళ్లు ల‌క్ష‌ల్లో ఉంటారు. ఉన్న ఒక‌టి అరా చంపే వ‌ర‌కూ నిద్ర‌పోనోళ్లు చాలామందే ఉంటారు.

బొద్దింక‌ను ముట్టుకోవ‌టానికి సైతం ఇష్ట‌ప‌డ‌ని.. వారెంద‌రో. అలాంటి వారికి ఇప్పుడు చెప్పే విష‌యాలు అస్స‌లు న‌చ్చ‌వు. ఆ మాట‌కు వ‌స్తే.. బొద్దింక‌ల పేరుతో చ‌దివేందుకు సైతం చిరాకుప‌డిపోతారు. కానీ.. ఇంత చిరాకు పుట్టించే జీవుల‌తో వంద‌ల కోట్ల రూపాయిల వ్యాపార‌మే కాదు.. జీవ‌న ప్ర‌మాణాలు పెంచ‌టానికి.. ఆరోగ్యాన్ని కాపాడేందుకు కార‌ణ‌మ‌వుతాయ‌న్న నిజం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.

ఇక‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లాంటి పాల‌కుల‌కైతే.. ఈ కొత్త త‌ర‌హా వ్యాపారం గురించి తెలిస్తే.. స‌రికొత్త ప‌థ‌కం తెర మీద‌కు వ‌చ్చే వీలుంది. ఇంత‌కీ.. అంద‌రికి చిరాకు పుట్టించే బొద్దింక‌ల‌తో కోట్లాది రూపాయిల వ్యాపారం ఎలా అంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ క‌థ‌నం ప్ర‌కారం చైనాలోని షాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని వంద‌లాది రైతులు ప్ర‌స్తుతం బొద్దింక‌ల ఫారాలు పెట్టి కోట్లాది బొద్దింక‌ల్ని ఉత్ప‌త్తి చేస్తున్నార‌ట‌. అక్క‌డ నిత్యం దాదాపు 300 కోట్ల బొద్దింక‌లు.. 15 ట‌న్నుల ఆహార వ్య‌ర్థాల‌ను వాడేస్తున్నాయ‌ట‌.

మ‌రింత భారీగా ఉత్ప‌త్తి చేస్తున్నబొద్దింక‌ల‌తో ఏం చేస్తారంటారా? ఔష‌ధాల్ని త‌యారు చేయ‌టం అందులో ఒక‌టైతే.. రెండో విధానంలో ఆహానంగా తీసుకోవ‌టం. ఏంటి? బొద్దింక‌ల్ని ఆహారంగా తీసుకుంటారా? అంటూ అవాక్కు అవ్వాల్సిన అవ‌స‌రం లేదు.హాంకాంగ్ వాసులు ఎంతో ఇష్టంగా బొద్దింక‌ల్ని ర‌క‌ర‌కాల టేస్టుల‌తో లాగించేస్తుంటారు. మ‌న ఆయుర్వేదంలో చెట్ల వేర్లు.. బెర‌డుల‌తో మందుల్ని త‌యారు చేసే తీరులోనే.. చైనా సంప్ర‌దాయ వైద్యంలో బొద్దింక‌ల నుంచి ఒక మందు త‌యారు చేస్తారు. దాన్ని కాంగ్ ఫ్లుక్సిన్ యో అన్న పేరుతో పిలుస్తుంటారు.ఈ మందు నోటి పూత‌.. పేగు పూతను త‌గ్గించ‌టంతో పాటు.. ఉద‌ర‌కోవ కేన్స‌ర్ ను నిరోధిస్తుంద‌న్న‌ది చైనీయుల న‌మ్మ‌కం.

దీంతో.. బొద్దింక‌ల డిమాండ్ చైనాలో ఎక్కువ‌. ఆ విష‌యాన్ని గుర్తించిన 400 మందికి పైగా రైతులు బొద్దింక‌ల్ని త‌యారు చేసే ప‌రిశ్ర‌మ‌ల్ని న‌డుపుతున్నారు. అయితే.. ఈ ఫాంలో బొద్దింక‌ల్ని ఒక ప‌ద్ద‌తిగా పెంచ‌టం ఉంటుంది.

28 డిగ్రీల నుంచి 33 డిగ్రీల మ‌ధ్య‌లో ఉష్ణోగ్ర‌త‌లు ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ.. గాలిలో తేమ‌.. వీచే గాలిలో వేగం.. పీడ‌నం మొత్తం బొద్దింక‌లు పెద్ద ఎత్తున పెరిగేందుకు వీలుగా ఉండే వాతావ‌ర‌ణాన్ని ఏర్పాటు చేస్తారు. వారంతా క‌లిసి రోజూ ఆరు ట‌న్నులు (6వేల కేజీలు) బొద్దింక‌ల్ని ఎక్కువ ఉష్ణోగ్ర‌త‌తో చంపేసి..వాటి గుజ్జు తీస్తారు. దీంతో చైనాలోని ఐదు ఫార్మా కంపెనీలకు అవ‌స‌ర‌మైన ముడిస‌రుకును స‌మ‌కూరుస్తారు. ఇదో ర‌క‌మైన వ్యాపార‌మైతే.. షాంగ్ డాంగ్ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో బొద్దింక‌ల‌తో ర‌క‌ర‌కాల ఆహార‌ప‌దార్థాల్ని త‌యారు చేస్తారట‌. బొద్దింక‌ల వేపుడు ఇప్పుడు అక్క హాట్ డిష్ గా చెబుతున్నారు. వినేందుకు వికారంగా ఉన్నా ఇది నిజం. మ‌న చుట్టూ మ‌న‌కు తెలీని ఎన్ని విష‌యాలు ఉన్నాయో క‌దూ?