Begin typing your search above and press return to search.

కాక్ టైల్ వ్యాక్సిన్ ఫలితాలు బ్రహ్మాండం

By:  Tupaki Desk   |   8 Aug 2021 1:11 PM GMT
కాక్ టైల్ వ్యాక్సిన్ ఫలితాలు బ్రహ్మాండం
X
కాక్ టైల్ వ్యాక్సిన్ ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నట్లు ఫలితాలు చెబుతున్నాయి. ఇంతకాలం ఇలాంటి వ్యాక్సిన్ కాక్ టైల్ విదేశాల్లో మాత్రమే ఉండేది. అలాంటిది ఇపుడు మనదేశంలో కూడా మొదలైనట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజాగా ప్రకటించింది. కొవాగ్జిన్+కోవీషీల్డ్ కలిపి ఇచ్చిన తర్వాత రోగుల్లో మంచి రోగ నిరోధక శక్తి పెరిగినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.

రెండు వేర్వేరు టీకాలను కలిపి ఇవ్వటమే వ్యాక్సిన్ కాక్ టైల్ లేదా వ్యాక్సిన్ మిక్సింగ్ అంటారు. మొదటి డోసు ఒక కంపెనీది తీసుకుంటే రెండో డోసు మరో కంపెనీది తీసుకోవటం అన్నమాట. నిజానికి దీనిపై దాదాపు నాలుగు నెలల క్రితమే విదేశాల్లో పరిశోధనలు మొదలైపోయాయి. అక్కడక్కడ పరిశోధనల్లో ఎదురుదెబ్బలు తగిలినా ఓవరాల్ గా మంచి ఫలితాలు సాధించినట్లే చెప్పుకోవాలి.

అలాంటిది ఇపుడు మనదేశంలో కూడా ఇలాంటి వ్యాక్సిన్ మిక్సింగ్ మొదలైంది. మే, జూన్ నెలల్లో ఉత్తరప్రదేశ్ లో మొదలైన వ్యాక్సిన్ మిక్సింగ్ ఇపుడు మంచి ఫలితాలు ఇస్తున్నాయట. ఎంపిక చేసుకున్నవారికి మొదటి డోసు కోవ్యాగ్జిన్ రెండో డోసుగా కోవీషీల్డ్ ఇచ్చారు. దీని వల్ల రోగుల్లో కొత్త వేరియంట్లను సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు కావాల్సిన యాంటీ బాడీలు డెలవప్ అయినట్లు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు గుర్తించారు.

ఈ పద్దతిలో మరో లాభం ఏమిటంటే టీకాల కొరతను అధిగమించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో కోవీషీల్డ్ అందుతుంటే కోవ్యాగ్జిన్ కు తీవ్రమైన కొరతుంది. అలాగే కోవ్యాగ్జిన్ తీసుకున్న వాళ్ళకు రెండో డోసు అందటం లేదు. టీకా కేంద్రాలకు ఎన్నిసార్లు తిరిగినా కోవీషీల్డ్ మాత్రం దొరుకుతోందనే సమాధానం వినిపిస్తోంది. వ్యాక్సిన్ మిక్సింగ్ వల్ల టీకాల కొరతను కూడా అధిగమనించినట్లవుతుందని ఐసీఎంఆర్ నిపుణులు చెబుతున్నారు.