Begin typing your search above and press return to search.

ఉప ఎన్నిక‌లో ప్ర‌చారంలో ప‌న్నీరు వ‌ర్గ పైత్యం

By:  Tupaki Desk   |   7 April 2017 5:14 AM GMT
ఉప ఎన్నిక‌లో ప్ర‌చారంలో ప‌న్నీరు వ‌ర్గ  పైత్యం
X
మిగిలిన వారితో పోలిస్తే.. త‌మిళ తంబీల‌కు పైత్యం కాస్త ఎక్కువ‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తుంటారు. అభిమానం వ‌చ్చినా.. ఆవేశం వ‌చ్చినా వారిని ఆప‌టం.. త‌ట్టుకోవ‌టం క‌ష్ట‌మ‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. అదెంత నిజ‌మ‌న్నది తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అమ్మ మ‌ర‌ణంతో జ‌రుగుతున్న ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల అక్క‌డి రాజ‌కీయ పార్టీల‌కు ఎంత కీల‌క‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అస‌రం లేదు. మ‌రీ ముఖ్యంగా అమ్మ పార్టీకి చెందిన అన్నాడీఎంకే లోని రెండు వ‌ర్గాల‌కు అత్యంత కీల‌క‌మైంది.

దీంతో.. ఈ ఎన్నిక‌లో విజ‌యం సాధించ‌టం కోసం అన్నాడీఎంకేలోని రెండు వ‌ర్గాలు వ్యూహ‌.. ప్ర‌తివ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ఉన్న ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌దిలిపెట్ట‌టం లేదు. అమ్మ మ‌ర‌ణం మీద ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న సందేహాల్ని వాడుకొని ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌న్న క‌క్కుర్తితో చేసిన తాజా ప‌ని ప‌న్నీరు వ‌ర్గానికి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.

అమ్మ మ‌ర‌ణంపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. ఆమె మ‌ర‌ణంపై ద‌ర్యాప్తు జ‌రిపించాల‌న్న‌ డిమాండ్‌ ను ప్ర‌జ‌ల్లోకి మ‌రింతగా తీసుకెళ్లేందుకు వేసిన ప్లాన్ రివ‌ర్స్ కొట్టింది. అమ్మ మృత‌దేహన్ని ఉంచిన శ‌వ‌పేటిక న‌మూనాలో ఒక డమ్మీ శ‌వ‌పేటిక‌ను సిద్ధం చేసి.. ఓపెన్ టాప్ జీపులో పెట్టుకొని ప్ర‌చారం చేయ‌టం వెగ‌టు పుట్టించింది. ఈ త‌ర‌హా ప్రచారంతో ప‌న్నీరు వ‌ర్గంపై ప‌లువురు విరుచుకుప‌డ్డారు. ఈ త‌ర‌హా ప్ర‌చారంపై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం కావ‌టంతో.. న‌మూనా శ‌వ‌పేటిక ప్ర‌చారాన్ని ఉప‌సంహ‌రించుకున్నారు. ప్ర‌చారం చేసుకోవ‌టం మామూలే అయినా.. మ‌రీ ఇంత పైత్యంతో ప్ర‌చారం చేయ‌టంపై ప‌లువురు విస్మ‌యానికి గురి అవుతున్నారు. దొరికిందే సందు అన్నట్లు ప‌న్నీరు వ‌ర్గం పైత్యంపై చిన్న‌మ్మ వ‌ర్గానికి చెందిన వారు.. చెల‌రేగిపోవ‌టమే కాదు.. వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఉప ఎన్నిక ఏమో కానీ.. అక్క‌డి రాజ‌కీయాలు మాత్రం హాట్ హాట్ గా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/