Begin typing your search above and press return to search.

వేలాది మందిపై వేటు వేయనున్న కాగ్నిజెంట్

By:  Tupaki Desk   |   31 Oct 2019 6:29 AM GMT
వేలాది మందిపై వేటు వేయనున్న కాగ్నిజెంట్
X
ఎప్పుడేం జరుగుతుందో అర్థంకానట్లుగా ఉండే అనిశ్చితి ఐటీ పరిశ్రమలో ఎక్కువే. ఎక్కడేం జరిగినా తీవ్ర ప్రభావానికి లోనయ్యే ఈ పరిశ్రమకు చెందిన ప్రముఖ కంపెనీలు తీసుకునే నిర్ణయాలు వేలాదిమంది జీవితాల్ని ప్రభావితం చేస్తుంటుంది. తాజాగా అలాంటి నిర్ణయాన్నే తీసుకుంది ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్. తన దగ్గర పని చేస్తున్న సీనియర్ ఉద్యోగులపై భారీ ఎత్తున వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

రాబోయే కొద్ది నెలల్లో తక్కువలో తక్కువ ఆరు నుంచి ఏడు వేల వరకూ ఉద్యోగుల్ని తగ్గించుకునేందుకు వీలుగా కాగ్నిజెంట్ నిర్ణయం తీసుకోనుంది. కంటెంట్ మోడరేషన్ బిజినెస్ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్న ఈ సంస్థ అందుకు సంబంధించి తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

క్లౌడ్.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని.. ఇందులో భాగంగా ఇప్పటికే తనకున్న ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున సీనియర్ ఉద్యోగుల్ని వదిలించుకోవాలన్న యోచనలో కాగ్నిజెంట్ ఉన్నట్లు చెబుతున్నారు.

సంస్థ హెడ్ క్వార్టర్ అయిన న్యూజెర్సీకి చెందిన కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రియాన్ హంఫ్రీస్ మాట్లాడుతూ.. రానున్న కాలంలో పది నుంచి పన్నెండు వేల మంది సీనియర్ ఉద్యోగుల్ని వారి ప్రస్తుత పాత్రల నుంచి తొలగిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో మనోళ్లు మీద ఈ ప్రభావం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో రెండు శాతం మంది మీద వేటు ప్రభావం ఉంటుందన్న అంచనా వ్యక్తమవుతోంది. అదే జరిగితే..ఐటీ జీవులకు అంతకు మించిన ఆందోళన మరొకటి ఉండదు. ఎందుకంటే ప్రముఖ కంపెనీల్లో ఏ ఒక్కరు ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆ బాటలో మిగిలిన కంపెనీలు నడిచే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.