Begin typing your search above and press return to search.

అమరావతి వైసీపీలో డిష్యుండిష్యుం

By:  Tupaki Desk   |   18 Nov 2015 5:49 AM GMT
అమరావతి వైసీపీలో డిష్యుండిష్యుం
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పిల్ల కాంగ్రెస్ అని అందరూ అంటున్నా విభేదాల విషయంలో మాత్రం అది అసలు కాంగ్రెస్ పార్టీకి తాతలా మారింది. ఏ ఇద్దరు నాయకులకూ అక్కడ పడని పరిస్తితి ఉంది. జిల్లాల్లో నేతలు ఎవరికివారు ఆధిపత్య పోరాటాలతో బిజీగా ఉండగా రాష్ట్ర స్థాయిలోనూ ఎవరికి వారు తమ ప్రాబల్యం చూపించుకోవడానికి ప్రచ్ఛన్న యుద్ధాలు చేస్తున్నారు. దీంతో వైసీపీ ఇప్పుడు విభేదాల పుట్టలా మారింది.

గత కొన్ని రోజులుగా వైసీపీ కార్యకలాపాల్లో చురుగ్గా లేని అంబటి రాంబాబు అకస్మాత్తుగా తెర మీదికి రావడం, అంతకుముందు లాగే హాట్ హాట్ ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ తరుపున అధికార పార్టీకి కౌంటర్ ఇవ్వడం చేస్తున్నారు.ఈ కార్యక్రమాలన్నింటినీ రాంబాబు గుంటూరు కేంద్రంగానే కొనసాగిస్తున్నారు.ఇంత‌కాలం మౌనంగా ఉండి, ఇప్పుడిలా అంబటి రాంబాబు మాట్లాడ‌డంపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు... ఆయన గుంటూరును వదలకుండా అక్కడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. దీంతో గుంటూరుకే చెందిన మరో సీనియర్ నేత ఇప్పుడు అంబటి రాంబాబు పేరు వింటే చాలు మండిపడుతున్నారట. ఆయన ఇంకెవరో కాదు... టీడీపీలో ఎన్నో పదవులు అనుభవించి వైసీపీలో చేరిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఉమ్మారెడ్డికి, అంబటి రాంబాబుకు మ‌ధ్య వైరం రాజుకుందట‌! రాంబాబు పున‌రాగ‌మ‌నంతో పార్టీలో, జిల్లా రాజకీయాల్లో తన ప్రాధాన్యత ఎక్కడ తగ్గిపోతుందోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారట ఉమ్మారెడ్డి. అందుకే రాంబాబు ప్రెస్ మీట్లకు కూడా దూరంగా ఉంటున్నారని వినిపిస్తోంది. అంతేకాదు... కొద్ది రోజులుగా గుంటూరు జిల్లాలో వైసీపీని గమనిస్తే.... అంబటి యాక్టివ్ గా ఉంటే ఉమ్మారెడ్డి సైలెంటవుతున్నారు. అంబటి తగ్గగానే ఉమ్మారెడ్డి యాక్టివ్ అవుతున్నారు.

కాగా ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ నేతలు ఒకరి పట్ల మరొకరు పట్టింపు ధోరణులతో వ్యవహరించడం పార్టీకి నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అంబటి మౌనంగా ఉన్నన్ని రోజులు ఉమ్మారెడ్డి పార్టీ కార్యకలాపాల్లో సీరియస్గా పాల్గొనడం, అంబటి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటుంటే ఉమ్మారెడ్డి మౌనం వహించడం నవ్వులాటగానే ఉంది.