Begin typing your search above and press return to search.

అనంత టీడీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   7 Sept 2017 9:58 AM IST
అనంత టీడీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే
X
అనంతపురం టీడీపీలో కొందరు నేతల మధ్య విబేదాలు కొత్తేమీ కాకపోయినా ఈసారి మరో ఇద్దరు నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. పెనుగొండ ఎమ్మెల్యే బీకే పార్థసారధి - హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప మధ్య కోల్డ్ వార్ సాగుతోందని అక్కడి టీడీపీ శ్రేణులు అంటున్నాయి.

ఎంపీ కిష్టప్ప తన నియోజకవర్గంలో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారనేది ఎమ్మెల్యే పార్థసారథి వాదన. నీరు-చెట్టు పథకం కింద పార్థసారథి 34 పనులకు ఓకే చేయించుకోగా ఎంపీ దాన్ని అడ్డుకోవడం రగడ మొదలైంది. ఎంపీగా ఉన్న తనకు తెలియకుండా ఎమ్మెల్యే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని కిష్టప్ప కూడా పార్టీ పెద్దలకు కంప్లయింట్ చేసినట్లు సమాచారం.

అయితే... బీకే వర్గీయులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. పెనుగొండలో పోటీ చేసేందుకు ఎంపీ రంగం సిద్ధం చేసుకుంటున్నారని... అందుకే ఆ నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పార్థసారథి కూడా... తమ నేతలకు ఎంపీ ఫోన్లు చేయడం, అభివృద్ధి పనులకు అడ్డు తగలడం వంటివి చేస్తున్నారని చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

నిజానికి కిష్టప్పకు వివాదరహితుడన్న పేరున్నప్పటికీ పరిస్థితులు ఆయనతో అలా చేయిస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. సీనియర్ నేతగా ఆయన కేంద్రంలో మంత్రి పదవి ఆశిస్తున్నా ఫలితం దక్కడం లేదు. 2019లోనూ ఆ కల తీరడం కష్టమే. దీంతో కనీసం అసెంబ్లీకి పోటీ చేస్తే రాష్ట్రంలోనైనా మంత్రి పదవి వెలగబెట్టొచ్చన్నది ఆయన ఆశట. అందుకే ఆయన కన్ను పెనుగొండపై పడింది... అదే వివాదాలకు దారితీస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల మాట.