Begin typing your search above and press return to search.

క‌ర్నూలులో ప్రొటోకాల్ వార్

By:  Tupaki Desk   |   27 Sep 2018 10:14 AM GMT
క‌ర్నూలులో ప్రొటోకాల్ వార్
X
నేత‌లు - అధికారుల మ‌ధ్య ప్రొటోకాల్ వార్ త‌ర‌చుగా జ‌రిగేదే. అధికారిక కార్య‌క్ర‌మాల్లో త‌మ‌కు త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదంటూ నాయ‌కులు -ఉన్న‌తాధికారులు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు గుప్పించుకుంటారు. ఫిర్యాదుల దాకా వెళ్తారు. తాజాగా క‌ర్నూలులోనే ఇలాంటి ఘ‌ట‌నే వెలుగుచూసింది. క‌ర్నూలు న‌గ‌ర పాల‌క క‌మిష‌న‌ర్ హ‌రినాథ్ రెడ్డి ప్రొటోకాల్ స‌రిగా పాటించ‌డం లేదంటూ ఎంపీ బుట్టా రేణుక తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే పుర‌పాల‌క శాఖ మంత్రి నారాయ‌ణ‌కు ఫిర్యాదు చేసిన ఆమె.. 28న సీఎం చంద్ర‌బాబును క‌లిసి ప‌రిస్థితిని వివ‌రించేందుకూ సిద్ధ‌మ‌వుతున్నారు.

క‌ర్నూలు న‌గ‌ర పాల‌క క‌మిష‌న‌ర్‌గా హ‌రినాథ్ రెడ్డి బాధ్య‌తలు చేప‌ట్టిన తొలినాళ్ల‌లో కేవీఆర్‌ కళాశాల వద్ద రహదారి విస్తరణలో భాగంగా కళాశాల గోడ పడగొట్టించారు. ఆ విష‌యంలో క‌ళాశాల విద్యార్థులు - లెక్చ‌ర‌ర్ల‌కు అనుకూలంగా రేణుక మాట్లాడారు. అప్ప‌టి నుంచే ఎంపీ - క‌మిష‌న‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం ప్రారంభ‌మైన‌ట్లు తెలుస్తోంది. నాటి నుంచి ప్రొటోకాల్ పాటించ‌కుండా రేణుక‌ను క‌మిష‌న‌ర్ అవ‌మానిస్తున్నార‌ని ఆమె అభిమానులు చెబుతున్నారు. క‌ర్నూలు న‌గ‌ర‌పాల‌క సంస్థ పరిధిలోని ఎస్సీ - ఎస్టీ ఉప ప్ర‌ణాళిక నిధుల విష‌యంలోనూ అవ‌క‌త‌వ‌క‌లు చోటుచేసుకున్నాయ‌ని.. వాటిపై ఆడిట్ నిర్వ‌హించాల‌ని ఎంపీ అభిమానులు ప‌ట్టుబ‌డుతున్నారు.

అవినీతిపై వస్తున్న వార్తలపై ప్రశ్నించడం వ‌ల్లే క‌మిష‌న‌ర్ త‌న‌ను దూరం పెడుతున్నార‌ని బుట్టా రేణుక ఆరోపిస్తున్నారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతానంటూ స్వ‌యంగా తాను ఫోన్ చేయించినా.. క‌మిష‌న‌ర్ ఆహ్వానం ఎందుకు పంపించ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఒక ఎంపీకి ఇంతకంటే అవ‌మానం ఇంకేదైనా ఉంటుందా అని ప్ర‌శ్నించారు. మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధిని కాబ‌ట్టే త‌న‌ను ఇలా క‌మిష‌న‌ర్ చిన్న‌చూపు చూస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.