Begin typing your search above and press return to search.

అప్పుడే టికెట్ల లొల్లి.. ఈ కాంగ్రెసోళ్లు మారరా?

By:  Tupaki Desk   |   19 Jan 2023 8:08 AM GMT
అప్పుడే టికెట్ల లొల్లి.. ఈ కాంగ్రెసోళ్లు మారరా?
X
తెలంగాణలో అధికారం కోసం రెండు సార్లు కొట్లాడి ఓడిపోయిన కాంగ్రెస్ నేతలకు ఇంకా సోయి రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారం కోసం ప్రజల్లోకి వెళ్లి కష్టపడాల్సింది పోయి టికెట్ల కోసం కొట్టుకుంటున్న తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో దిగజారుతున్న కాంగ్రెస్ పరిస్తితిని మార్చకుండా.. నేతలు ఇప్పటి నుంచే టికెట్ల లొల్లి షురూ చేయడం విస్తుగొలుపుతోంది.

తాజాగా జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి పొన్నాల లక్ష్మయ్యపై సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు తనకే కావాలని ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో జనగామ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే టికెట్ల కోసం ముష్టి యుద్ధాలు మొదలైనట్లు చర్చ సాగుతోంది.

తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి మారాడు.. కానీ కాంగ్రెస్ పరిస్థితి మాత్రం తెలంగాణలో మారేలా కనిపించడం లేదు. సీనియర్లు, జూనియర్లు కలిసిపోయిన దాఖలాలు లేవు. సమష్టిగా ఉంటామని కొత్త ఇన్ చార్జి థాక్రేకు నేతల హామీలు కేవలం ఉత్తుత్తి ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. లోలోపల నాయకుల మధ్య విభేదాలు మీటింగ్ నుంచి బయటకు రాగానే బయటపడుతున్నాయి. రేవంత్ రెడ్డి పాదయాత్రపై అనుమానాలు నెలకొంటున్నాయి.పార్టీ కోసం సమష్టిగా పనిచేస్తామని థాక్రేకు కాంగ్రెస్ నేతలు వాగ్ధానం చేశారట.. ప్రస్తుతమున్న టీపీసీసీ కమిటీలను సీనియర్లు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కస్టపడే కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.
పార్టీ బలోపేతం కోసం తాము కృషి చేస్తుంటే కీలక పోస్టుల్లో ఉన్న వ్యక్తులు మాత్రం నిత్యం విమర్శలతో వార్తల్లో నిలుస్తున్నారు. పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం.. ఒకరినొకరు తిట్టిపోసుకోవడం.. చిన్న విషయాలకు రచ్చ చేసుకోవడం అలవాటుగా మారింది.

తాజాగా జనగామ టికెట్ తనకే కావాలని ఆ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవారెడ్డి అసమ్మతి రాజేశారు. కాంగ్రెస్ టికెట్ విషయంలో పొన్నాల లక్ష్మయ్య డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ఒక కార్యకర్తతో టికెట్ తనకే అంటూ పొన్నాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జంగా రాఘవరెడ్డి ఆడియో వైరల్ అవుతోంది. అందులో పొన్నాలపై సంచలన ఆరోపణలు చేశారు.

పొన్నాల మంత్రిగా ఉన్న సమయంలో తాను 10 కోట్ల కమిషన్ ఇప్పించానని రాఘవరెడ్డి ఆ ఆడియోలో సంచలన ఆరోపణలు చేశారు. పొన్నాల ఎవరినీ స్థానికంగా ఎదగనివ్వడని..ఆయన కొడుకు, కోడలు సైతం ఆయనతో లేరని ఆరోపించారు. పొన్నాల సొంతూరు ఖిలాషాపూర్ గ్రామానికి రోడ్డును కూడా తానే మంజూరు చేయించానని రాఘవరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ ఇవ్వాలని.. ఇవ్వకుంటే పార్టీకి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని అధిష్టానానికి తేల్చి చెప్పినట్టు రాఘవరెడ్డి తెలిపారు. ఇందులోనూ పొన్నాల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

అయితే ఈ ఆడియో ఒరిజినలా? లేక ఫేక్ యేనా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జనగామ టికెట్ కోసం కోల్డ్ వార్ మొదలైనట్టుగా స్పష్టంగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.