Begin typing your search above and press return to search.

ఒక‌రిని పొగ‌డాలంటే ఒక‌రిని అవ‌మానించాలా కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   20 Jun 2017 9:33 AM GMT
ఒక‌రిని పొగ‌డాలంటే ఒక‌రిని అవ‌మానించాలా కేసీఆర్‌?
X
నోటి మాట‌కు మించిన శ‌త్రువు మ‌రొక‌టి ఉండ‌దు. ఆచితూచి మాట్లాడే విష‌యంలో ఏచిన్న తేడా వ‌చ్చినా జ‌రిగే న‌ష్టం అపారంగా ఉంటుంది. మాట‌ల మాంత్రికుడిగా అభివ‌ర్ణించే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌ల‌కు వంక పెట్ట‌లేం. కానీ.. ఆత్మ‌విశ్వాసం మోతాదు మించితే కేసీఆర్ లాంటి నేత అయినా త‌ప్పు చేస్తారు.. మాట‌ల్లో త‌ప్పులు దొర్లుతాయ‌న‌టానికి తాజా ఉదంతం ఒక ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.

తెలంగాణ‌లో గొర్రెల పంపిణీ ప‌థ‌కాన్ని భారీగా చేప‌ట్టిన తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు.. ఈ రోజు ఆ కార్య‌క్ర‌మాన్ని సిద్ధిపేట లోని కొండ‌పాక‌లో ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిధిగా హాజ‌రైన ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య‌లు కొన్ని కొంద‌రిని మ‌న‌స్తాపానికి గురి చేశాయ‌ని చెబుతున్నారు.

రానున్న మూడేళ్ల వ్య‌వ‌ధిలో గొల్ల కురుములు ఒక్క‌రే రూ.25 వేల కోట్ల రూపాయిల సంప‌ద‌న‌ను సృష్టించ‌నున్న‌ట్లుగా చెప్పిన కేసీఆర్‌.. అదెలా అన్న‌ది నోటి లెక్క చెప్పేశారు. ఈ లెక్క‌లు.. అంకెల్ని ప‌క్క‌న పెడితే.. గొల్ల కురుముల గొప్ప‌త‌నాన్ని వివ‌రిస్తూ.. గొల్ల‌లు త‌మ ద‌గ్గ‌ర ఉన్న గొర్రెల్లో ఎవ‌రి గొర్రె ఏమిట‌న్న‌ది ఇట్టే గుర్తిస్తార‌ని.. అత‌డికి గొర్రె ఇచ్చి.. కొన్నాళ్ల త‌ర్వాత వ‌చ్చి నా గొర్రె ఏదంటే.. క‌చ్ఛితంగా చూపిస్తార‌ని.. అంత‌టి నైపుణ్యం వారి సొంత‌మ‌ని పొగిడారు. ఈ మాట‌ల్ని త‌ప్పు ప‌ట్టాల్సిందేమీ లేదు.

వ‌చ్చిన ఇబ్బందంతా.. ఈ పొగిడే కార్య‌క్ర‌మంలోకి స్టేజ్ మీద ఉన్న క‌లెక్ట‌ర్.. ఐఏఎస్ అధికారి పేర్ల‌ను ప్ర‌స్తావించి మ‌రీ.. గొర్రెల్ని ఇలా గుర్తించటం వారు చేయ‌లేర‌ని.. కేవ‌లం గొల్ల‌కురుములు మాత్ర‌మే చేస్తార‌ని చెప్పారు. ఎవ‌రి గొప్ప‌త‌నం వారిది. కానీ.. ఒక‌రిని పొగ‌డ‌టానికి మ‌రొక‌రిని కించ‌ప‌ర్చ‌టం మంచిది కాదు. బాగా అర్థం కావాల‌న్న ఆలోచ‌న‌లో ఇలా చెప్పొచ్చు. కానీ.. సున్నిత మ‌న‌స్కులు ఇలాంటి మాట‌ల‌కు బాధ ప‌డ‌తార‌న్న విష‌యాన్ని కేసీఆర్ ఎందుకు మ‌ర్చిపోతార‌న్న మాట‌ను కొంద‌రు ఐఏఎస్ అధికారులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. గొల్ల కురుముల‌కు ఉన్న నైపుణ్యం ఐఏఎస్ ల‌కు ఉండ‌ద‌న్న మాట‌ను చెప్పే విధానంలో త‌ప్పుగా దొర్లింద‌న్న అభిప్రాయాన్ని కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. అయినా.. మాట‌ల మాంత్రికుడి నోటి నుంచి త‌ప్పులు దొర్ల‌టం ఏమిటి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/