Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ వచ్చినా.. మళ్లీ మళ్లీ వచ్చే కరోనా.. సంచలనంగా తాజా రిపోర్టు

By:  Tupaki Desk   |   17 Oct 2020 4:00 AM GMT
వ్యాక్సిన్ వచ్చినా.. మళ్లీ మళ్లీ వచ్చే కరోనా.. సంచలనంగా తాజా రిపోర్టు
X
ఒకసారి రావటం జరిగాక.. పోవటం అంత ఈజీ కాదన్నట్లుగా మారింది కరోనా మహమ్మారి వ్యవహారం చూస్తుంటే. స్వల్ప వ్యవధిలో ప్రపంచాన్ని చుట్టేసిన ఈ పాడు వైరస్ మనిషి జీవితంతో కలిసి ప్రయాణిస్తుందన్న వాదనకు బలం చేకూరే అధ్యయనం ఒకటి బయటకువచ్చింది. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా పదేపదే కరోనా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కొన్ని వ్యాధులకు టీకాలు ఉన్నా.. ఎలా అయితే కంట్రోల్ చేయలేకపోతామో.. సరిగ్గా అలాంటి పరిస్థితే కరోనా విషయంలోనూ ఉంటుందని చెబుతున్నారు.

కరోనా విషయంలో ఎన్ని జాగ్రత్తలు.. చర్యలు తీసుకున్నా.. అవన్నీ తాత్కాలికమే తప్పించి పర్మినెంట్ సొల్యూషన్ అయితే కాదంటున్నారు. అంతేకాదు.. వైరస్ మనిషి శరీరంలోకి సోకిన తర్వాత అదెంత కాలం శరీరంలో ఉంటుందన్నది ఒక ప్రశ్న. అంతేకాదు.. కరోనా వచ్చిన తర్వాత శరీరంలో ఉండే యాంటీ బాడీలు ఎంత కాలం ఉంటాయి? అన్న దానికి కూడా సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు.

ఇలాంటివేళ కొలంబియా మెయిల్ మాన్ స్కూల్ వారు చేపట్టిన అధ్యయనం ప్రకారం.. కరోనా అన్నది వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా మిగిలిన సాధారణ వైరస్ మాదిరే కొనసాగే అవకాశం ఉందన్న వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. అంటే.. కరోనాను పూర్తిగా నిర్మూలించటం సాధ్యమయ్యే విషయం కాదు. అదే సమయంలో వ్యాక్సిన్ వచ్చినా.. దానంతట అదే రావటానికి అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. మిజిల్స్ కు వ్యాక్సిన్ ఉంది. దాన్ని వాడిన తర్వాత కూడా అదెలా అయితే వస్తుందో.. అదే రీతిలో కరోనా కూడా భవిష్యత్తులో ఉంటుందని చెబుతున్నారు.

అయితే.. కరోనా రీ ఇన్ఫెక్షన్ అన్న విషయాన్ని రుజువు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మరిన్నిపరిశోధనలు జరగాల్సి ఉందని చెబుతున్నారు. ఎంత తరచు సోకే అవకాశం ఉంది? వైరస్ అటాక్ అయిన వ్యక్తి నుంచి ఎంతమందికి వైరస్ సోకే అవకాశం ఉంది? వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఏ మేరకు ప్రభావాన్ని చూపుతాయి? లాంటి అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఈ వాదన విన్నప్పుడు కలిగే భావన ఒక్కటే.. ఏ ముహుర్తాన వచ్చిందో కానీ.. కరోనా మానవాళి వెంట తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని. అందుకు తగ్గట్లుగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. కరోనానా మజాకానా?