Begin typing your search above and press return to search.

30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ‌..నువ్వు ఒప్పుకోక‌పోతే ఏంటి ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   5 Dec 2019 11:04 AM GMT
30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ‌..నువ్వు ఒప్పుకోక‌పోతే ఏంటి ప‌వ‌న్‌
X
రాయ‌ల‌సీమ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌...తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ...ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రత్యేక హోదా విషయంలో సిద్ధాంతపరంగానే బీజేపీని విభేదించానే త‌ప్ప బీజేపీకి తాను ఎప్పుడూ దూరంగా లేనని - కలిసే ఉన్నానని చెప్పారు. ప‌వ‌న్ చెప్పారు. ‘వైఎస్సార్సీపీ నేతలకు విమర్శలు చేయడం తప్ప ఇంకేమీ చేయడం తెలియదు’ అని విమర్శించారు. దీనిపై తాజాగా శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్‌ (ఎస్వీబీసీ) ఛైర్మన్ - వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి పృథ్వీరాజ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పవన్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల‌తో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డిని...తాను ముఖ్యమంత్రిగా ఒప్పుకోనని పవన్ కళ్యాణ్ అనడాన్ని ఏమంటారని పృథ్వీ వ్యాఖ్యానించారు. రికార్డు స్థాయి మెజార్టీతో - 150కిపైగా సీట్లతో వైఎస్‌ జగన్‌ ను ప్రజలు సీఎంను చేశారని - ఇంకా పవన్‌ ఒప్పుకోకపోవడం ఏమిటని ఆయ‌న ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కంటే మంచి సీఎంగా వైఎస్‌ జగన్ పేరు తెచ్చుకుంటున్నారని - రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడకెళ్ళినా ప్రజలు జగన్ పరిపాలనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని పృథ్వీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానంటున్నా పవన్.. గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో ఒక్కసారి కూడా ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. హిందు దేవాలయాల్లో ఎక్కడ కూడా అన్యమత ప్రచారం జరగడం లేదని - ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పృథ్వీరాజ్‌ స్పష్టం చేశారు. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకూడదని తాము ఒట్టు పెట్టుకున్నట్లు పేర్కొన్న పృథ్వీ అందుకే కాకినాడ‌లో మాట్లాడుతున్నాన‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్షాల‌పై సైతం పృథ్వీ ఘాటుగా స్పందించారు. వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కాకుండా సైద్ధాంతికంగా ఎదుర్కోవాల‌ని ప్రతిపక్షాలకు ఆయన సూచించారు. తాము వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లడం లేదని - అయినా మిగతా పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. త‌మ వైఖ‌రిని ప్ర‌తిరోజూ స‌మీక్షించుకోవాల‌ని పృథ్వీ సూచించారు.