Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డి నోట‌.. `ద‌ళిత సీఎం` మాట‌!

By:  Tupaki Desk   |   27 Aug 2021 10:30 AM GMT
కోమ‌టిరెడ్డి నోట‌.. `ద‌ళిత సీఎం` మాట‌!
X
సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేరాఫ్ అనే విష‌యం తెలిసిందే. ఆయ‌న న‌నోరు విప్పితే.. సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూస్తాయి. చ‌ర్చ‌కు కూడా దారితీస్తాయి. సీఎం కేసీఆర్‌పైనా, ఆయ‌న మంత్రి వ‌ర్గంపైనా అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ విరుచుకుప‌డే.. వెంక‌ట‌రెడ్డి.. తాజాగా చేసిన కామెంట్లు.. భారీ ఎత్తున చ‌ర్చ‌కు దారితీశాయి. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా ప్రయత్నిస్తానని ప్ర‌క‌టించారు.

వాస్త‌వానికి కాంగ్రెస్ పార్టీలో ఏమీ కీల‌క ప‌ద‌విలో లేని.. వెంక‌ట‌రెడ్డి ప్ర‌స్తుతం ఎంపీగా మాత్ర‌మే ఉన్నారు. కానీ, ఆయ‌న కాంగ్రెస్ విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించ‌డం.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం వంటివి చ‌ర్చ‌కు దారితీశాయి. ఎలాగంటే.. కాంగ్రెస్ ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం అభ్య‌ర్థి విష‌యంలో ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. పైగా ఇది పూర్తిగా అధిష్టానం నిర్ణ‌యం. కానీ, వెంక‌ట‌రెడ్డి మాత్రం ప్ర‌స్తుత పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్‌ను టార్గెట్ చేస్తున్నారా? అనే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ క్ర‌మంలోనే వెంక‌ట‌రెడ్డి వ్యాఖ్య‌ల వెనుక వ్యూహం ఉందా? అనేప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి. వాస్త‌వానికి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో హుషారు వచ్చింది. అందరూ యాక్టివ్ అయిపోయారు. కాంగ్రెస్ మునుపెన్నడూ లేని విధంగా సవాల్ విసురుతోందని టీఆర్ఎస్‌కూ అర్థమైపోయింది. అయితే.. ఈ ప‌ద‌విని ఆశించి భంగ‌ప‌డ్డ‌.. వెంక‌ట‌రెడ్డి.. రేవంత్ రెడ్డి పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న పీసీసీ చీఫ్ అయితే.. కాంగ్రెస్ మరింత దిగజారిపోతుంద‌న్న‌ట్టు వ్యాఖ్యానించారు. అయితే.. తాజాగా ఆయ‌న ముఖ్యమమంత్రి పదవి గురించి మాట్లాడడం, అందునా.. ద‌ళిత ముఖ్య‌మంత్రి అంటూ.. వ్యాఖ్య‌లు చేయ‌డం వంటివి సంచ‌ల‌నంగా మారాయి.

ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితిని బ‌ట్టి.. కాంగ‌గ్రెస్ పుంజుకునేందుకు రేవంత్ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నారు. అంతేకాదు.. అంద‌రినీ క‌లుపుకొని పోతున్నారు. పైగా ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. త‌మ‌కు 72 సీట్లు సాధించేందుకు సిద్ధంగా ఉంద‌నిప్ర‌క‌టించారు. ఇదే క‌నుక జ‌రిగితే.. రేవంత్‌కు సీఎం సీటు ఖాయం. అధిష్టానం కూడా.. రేవంత్ ప‌టిమ‌ను గుర్తించ‌డం ఖాయం! సో.. ఈ ప‌రిణామాల‌ను గుర్తించే ఏమో.. వెంక‌ట‌రెడ్డి వ్యూహాత్మ‌కంగా ద‌ళిత సీఎం అనే కామెంట్ చేసి ఉంటార‌ని.. దీనిని అడ్డు పెట్టి రేవంత్‌కు అడ్డంకులు సృషించే వ్యూహం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.