Begin typing your search above and press return to search.

బ్రహ్మానందం అసల కమెడియన్ కాదు.. జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   24 Dec 2021 8:30 AM GMT
బ్రహ్మానందం అసల కమెడియన్ కాదు.. జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు
X
సినీ హాస్యనటుడు బ్రహ్మానందం గురించి అందరు అనుకునే మాటలకు..ఆయన వ్యవహరించే తీరుకు ఏ మాత్రం పోలిక ఉండదన్న విషయం ఆయనతో పరిచయం ఉన్న వారంతా చెబుతారు. తెర మీద ఆయన చేసే కామెడీకి పూర్తి భిన్నంగా ఆయన తీరు ఉంటుంది. తాజాగా ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. సినీ నటుడు బ్రహ్మానందంతో పాటు పలువురు ప్రముఖులకు అవార్డుల్ని అందించే కార్యక్రమానికి హాజరైన ఆయన.. బ్రహ్మనందం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘బ్రహ్మానందం అంటే.. మీరేదో హాస్యం అనుకుంటున్నారు కానీ ఆయన చాలా గంభీరమైన వ్యక్తి. నిప్పులా ఉంటారు. డైనమెట్ లా ఉంటారు. ఆయన ఎప్పుడు పేలుతాడో తెలీదు. ఆయన్ను డీల్ చేయటం చాలా కష్టం’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత అనుభవం గురించి ఆయన చెప్పారు. ‘నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినప్పుడు ఒక మిత్రుడి ద్వారా వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని పంపాడు.

అక్కడితో ఆయన నన్ను వదల్లేదు. రెండు గంటల పాటు అనేక ప్రశ్నలు వేసి.. నేను సమాధానం చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారు. బ్రహ్మనందం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పారు.

బ్రహ్మానందాన్ని హాస్యనటుడే కదా అని అనుకోవద్దని.. ఆయన కూడా జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారన్నారు. ఆయన్ను వారి తండ్రి ఎంతో క్రమశిక్షణతో పెంచారని.. ఆయన కష్టంతోనే ఈస్థాయికి చేరుకున్నారన్నారు. బ్రహ్మానందంతో పాటు.. ఇదే సంస్థ అందించిన అవార్డు పొందిన యాంకర్ సుమ గురించి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఆమె మలయాళీ కాదని.. తెలుగు అమ్మాయిగా చమత్కరించారు. ఆమె ఇప్పుడు మలయాళీగా పుట్టి ఉండొచ్చు కానీ.. గత జన్మలో తెలుగు అమ్మాయి అయి ఉంటుందన్నారు.

అవార్డు అందుకున్న డాక్టర్ మస్తాన్ గురించి చెబుతూ.. తనకు వ్యక్తిగత వైద్యులుగా వ్యవహరించిన ఆయన.. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో పలువురికి ఆయన వైద్యం చేస్తుంటారని చెప్పారు. గంటల తరబడి కోర్టులో కూర్చోవాల్సి రావటంతో.. న్యాయమూర్తులు వెన్నునొప్పి లాంటి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారని.. అలాంటి వారికి డాక్టర్ మస్తాన్ వైద్యం చేస్తుంటారన్నారు.