Begin typing your search above and press return to search.

అమరజవాన్లకు 110 కోట్లు.. సామాన్యుడి సాహసం

By:  Tupaki Desk   |   4 March 2019 10:47 AM GMT
అమరజవాన్లకు 110 కోట్లు.. సామాన్యుడి సాహసం
X
44 ఏళ్ల ముర్తాజా ఏ అహ్మద్ అనే వ్యక్తి అమరజవాన్ల త్యాగాలకు మనస్తాపం చెంది అంతులేని దానమిచ్చి వార్తల్లో నిలిచాడు. సక్రమంగా పన్నుకట్టిన దాదాపు 110 కోట్లను ప్రధానమంత్రి జాతీయ రిలీఫ్ ఫండ్ కు ఇచ్చి అమరజవాన్లకు సాయం చేయాలని ప్రధానిని కోరాడు.. అమరులైన జవానులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం అలాంటి భారీ మొత్తాన్ని దానం చేయాలని ఆయన తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

ముర్తాజా అహ్మద్ మొదట ప్రధానమంత్రి కార్యాలయానికి ఈమెల్ ద్వారా సంప్రదించాడు. ప్రధాని నరేంద్రమోడీని కలిసి ఈ 110 కోట్ల మొత్తాన్ని విరాళంగా సమర్పిస్తానని విన్నవించాడు. ముర్తాజా పుట్టుకతోనే గుడ్డివాడు. ప్రస్తుతం ముంబైలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. మన దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికులకు నేను ఇస్తున్న చిన్న మొత్తమని.. అందరూ వారి కుటుంబాలకు సాయం చేయాలని ముర్తాజా కోరారు.

ముర్తాజా ప్రముఖ శాస్త్రవేత్త.. ఫ్యుయల్ బర్న్ రేడియేషన్ టెక్నాలజీని కనిపెట్టారు. ఆవిష్కరణతో జీపీఎస్ లేకుండానే ఏ వాహనాన్ని అయినా గుర్తించడంలో సహాయపడుతుంది. భవిష్యత్ లో పుల్వామా తరహా దాడులను అరికట్టడానికి ముర్తాజా కనిపెట్టిన టెక్నాలజీ ఎంతో దోహదపడుతుంది.

దేశంలోని ప్రముఖ వ్యక్తులైన అమితాబ్ బచ్చన్, లతామంగేష్కర్ లాంటి ప్రముఖులు సైతం రూ.1కోటి. రూ.2.5 కోట్లు మాత్రమే విరాళంగా ఇచ్చారు. ఇక దేశవ్యాప్తంగా ఎంపీలు తమ జీతం, ఫండ్స్ నుంచి 7.5 కోట్లను పుల్వామా మృతులకు అందించారు. కానీ ముర్తాజా మాత్రం 110 కోట్లు విరాళంగా అందిస్తానని ఇప్పుడు దేశవ్యాప్తంగా అభినందనలు అందుకుంటున్నారు.