Begin typing your search above and press return to search.

ఏం చేసుండారని వేయాలబ్బ బీజేపీకి ఓటు..!

By:  Tupaki Desk   |   30 March 2021 9:32 AM GMT
ఏం చేసుండారని వేయాలబ్బ బీజేపీకి ఓటు..!
X
'తిరుపతి ఉప ఎన్నిక జరుగుతాంది..! వైసీసీ - టీడీపీ పోటీచేస్తుండాయి.. బాగుండాది. కానీ ఈ బీజేపీ ఏం చేసేదానికి పోటీ చేస్తాంది? ఆ పార్టీ అభ్యర్థి రత్నప్రభ అంట. ఎవరా అమ్మి.. ఈ దినం వరకు నాకయితే తెల్వదు యా యమ్మి ఎవరో? అసలు బీజేపీకి ఎందుకు ఓటేయాలా? గ్యాస్​ సిలిండర్ ధరలు

పెంచినారనా.. పెట్రోలు ధరలు బాదుతుండారనా? అసలు కేంద్రముల్ల అధికారం చేస్తున్న ఆ బీజేపీ ఈ పాటికి ఈ రాయలసీమకు గానీ .. ఆంధ్రప్రదేశ్​కు గానీ చేసిందేంది అంట.

2014 ఎన్నికల టైంలో ప్రధాని నరేంద్రమోదీ - ఇప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు - చంద్రబాబు - పవన్ ​కల్యాణ్​ ఇంత మంది వేదికెక్కి చెప్పిందేంది.. చేసిందేంది?. ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇస్తామని అనాడు కాంగ్రెస్​ అంటే బీజేపీ పదేళ్లు ఇస్తామని చెప్పుండ్లే.. మరి ఇచ్చినారా? కనీసం యాడాదైనా

ఇచ్చినారా? తిరుపతిలో ఐఐటీ కాలేజీ కట్టిస్తాండమని.. ఇదే మోదీ ఆనాడు హామీ ఇచ్చుండాడు గదా.. ఆ మాట ఏమైనాది? ఇప్పటికీ సొంత బిల్డింగులు కట్టక పాయే.

పెట్రోలు ధరలు పెంచినేటి దానికి - గ్యాస్​ సిలిండర్ ధర పెంచినేటి దానికి.. రైతులు కడుపు కొట్టనికే రైతు చట్టాలు తెచ్చినేటి దానికి ఇప్పుడు మేము బీజేపీకి ఓటు వేయాల్నా? ఇంక ఏ దానికి ఓటు వేయాలే? అసలు ఆ బీజేపీలో ఉన్నోళ్లు ఏ ముఖం పెట్టుకొని వస్తుండారు.. ఓట్లు అడిగేదానికి..! ప్రత్యేక హోదా

తెచ్చిస్తమన్న పవన్ ​కల్యాణ్​ అడ్రస్​ లేకుండా పోయి సినిమాలు తీస్తాండు.. మేము ఓట్లేస్తై వైసీసీ కి వేస్తం. అంత గాదంటే టీడీపీకి ఓట్లు వేస్తం గాని.. బీజేపీకి ఎట్టా వేస్తం’

ప్రస్తుతం చిత్తూరు జిల్లా తిరుపతి పార్లమెంటు పరిధిలోని మారుమూల పల్లెటూర్లలో ఇదే తరహా చర్చ నడుస్తున్నది. రచ్చ బండ మీద కూర్చునే పెద్దవాళ్లు అచ్చం ఇదే రీతిలో మాట్లాడుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్​ రావడంతో ఏపీలో పొలిటికల్​ హీట్​ పెరిగింది. ఇప్పటికే మున్సిపల్​ ఎన్నికల్లో

మెజార్టీ స్థానాలు గెలుచుకొని వైసీపీ మాంచి ఊపుమీద ఉన్నది. ఇక టీడీపీ కూడా పట్టు నిలుపుకొనేందుకు పనబాక లక్ష్మిని పోటీకి నిలిపింది. ఆమెకూడా అయిష్టంగానే పోటీ చేస్తున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే ఏపీలో బీజేపీ - జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా తిరుపతి సీటును జనసేన వదులుకున్నది. బీజేపీ ఆ స్థానం నుంచి పోటీచేస్తున్నది. అయితే అక్కడి ప్రజలు మాత్రం బీజేపీ మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. విభజన హామీలు నెరవేర్చలేదని ఏపీ ప్రజలు

బీజేపీ మీద ఎప్పటి నుంచో కోపంగా ఉన్నారు. పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని స్వయంగా నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. కానీ అప్పట్లో చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకోవడంతో కేంద్రం ప్రత్యేక హోదా అనే అంశాన్ని మరిచిపోయింది.

అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతున్నా .. ఏపీలో ఆ పార్టీ కనీసం ఉనికిలో కూడా లేకుండా పోయింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పుట్టెడు కష్టాల్లో ఉన్న ఏపీని కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని అక్కడి ప్రజలు

ఎప్పటి నుంచో ఆగ్రహంగా ఉన్నారు. అయితే తిరుపతి సీటులో జనసేన పోటీచేస్తే కనీసం అన్నో ఇన్నో సీట్లు పడేవేమో గానీ.. బీజేపీ బరిలోకి దిగడంతో సీన్​ మారిపోయింది.

మరోవైపు ఎవరికీ తెలియని రత్నప్రభ అనే ఓ అభ్యర్థిని అక్కడ పోటీకి నిలిపారు. ఆమె రాజకీయాలకు కొత్త . దీంతో ఈ ఎన్నికల్లో బీజేపీకి కనీసం డిపాజిట్​ కూడా దక్కక పోవచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే. ఇటీవల పెట్రోలు - ధరలు

విపరీతంగా పెరిగాయి. గ్యాస్​ ధరలు పెరిగాయి. దానికి తోడు రైతు చట్టాలు తీసుకురావడం కూడా ఆపార్టీకి మైనస్​ అయింది. అనేక హామీలను విస్మరించింది కేంద్రం. తిరుపతిలో ఐఐటీ కళాశాల మంజూరు చేసి ఏళ్లు గడుస్తున్నా సొంత బిల్డింగ్ లు మాత్రం నిధులు ఇవ్వలేకపోయారు. ఆ హామీని

నెరవేర్చలేకపోయారు.బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి కనీసం చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ ఇవ్వలేక పోయింది కేంద్రం. దీంతో ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.