Begin typing your search above and press return to search.

అన్న భేటీకి రెఢీ అయితే.. చెల్లెలు తిట్టేసింది

By:  Tupaki Desk   |   28 Sep 2016 4:44 PM GMT
అన్న భేటీకి రెఢీ అయితే.. చెల్లెలు తిట్టేసింది
X
ఒకే పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు వేర్వేరుగా మాట్లాడతారా?సాధారణంగా అలాంటి అవకాశమే ఉండదు. అందులోకి ఢిల్లీలో చక్రం తిప్పుతున్న పెద్ద మనిషి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారు. అదేం సిత్రమో కానీ.. కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్లు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ కవిత వెంకయ్యను ఓ రేంజ్లో ఏసుకుంటే.. మరోవైపు ఆమె సోదరుడు కమ్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాత్రం చెల్లెలు తిట్టేసిన పెద్దమనిషితో సాయం కోసం భేటీకి ఢిల్లీకి వెళ్లనుండటం ఆసక్తికరంగా మారింది.

ఓ చేత్తో సాయాన్ని కోరుతూ.. మరో చేత్తో చావు తిట్లు తిట్టేయటం కేసీఆర్ ఫ్యామిలీకి మాత్రమే సాధ్యమేమో. సాధారణంగా సాయం కోరే వారి దగ్గర తగ్గి ఉండటం ఉంటుంది. ఇందుకు భిన్నమైన వైఖరితో వ్యవహరించటం తెలంగాణ అధికారపక్షానికే కుదురుతుందేమో? తాజాగా మీడియాతో మాట్లాడిన ఎంపీ కవిత వెంకయ్యపై విమర్శనాస్త్రాల్ని సంధించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చినా.. నష్టం ఏపీకే జరిగినట్లుగా మంత్రి వెంకయ్య వ్యాఖ్యలు ఉన్నాయంటూ విమర్శించారు కవిత.

భారీ వర్షాలు.. వరదల కారణంగా కేంద్రం అందించే సాయం రెండు రాష్ట్రాలకు ఒకేలా ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. మరోవైపు మంత్రి కేటీఆర్ గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. భారీ వర్షాలకు హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని ఆయనకు వివరించి.. కేంద్ర సాయాన్ని కోరనున్నారు. ఓపక్క సాయానికి అన్న ఢిల్లీ వెళుతుంటే.. మరోవైపు అన్న సాయం కోరే వెంకయ్యపై కవిత విరుచుకుపడటం గమనార్హం.

ఇలా ఒకే అంశానికి సంబంధించి ఒకే ఫ్యామిలీకి సంబంధించి కీలక నేతలు వేర్వేరుగా రియాక్ట్ కావటం చూస్తుంటే.. అన్నాచెల్లెళ్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో వచ్చిన భావన కలగటం ఖాయం. వీరిద్దరి మధ్య గ్యాప్ ఉందో లేదో కానీ.. తనను తిట్టేసిన కవితపై కేటీఆర్ తో వెంకయ్య ఏం చెబుతారో..?