Begin typing your search above and press return to search.

కేసీఆర్ లెక్క‌నే క‌మ్యూనిస్టు సీఎం ఆలోచించిండు ఏంది బై?

By:  Tupaki Desk   |   7 Feb 2022 3:30 AM GMT
కేసీఆర్ లెక్క‌నే క‌మ్యూనిస్టు సీఎం ఆలోచించిండు ఏంది బై?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బాట‌లోనే ఇటీవ‌లే ఆయ‌న‌తో దోస్తీ కుదుర్చుకున్న క‌మ్యూనిస్టు సీఎం న‌డుచుకుంటున్నార‌ని సోష‌ల్ మీడియాలో ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. సీఎంపై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు ఓ ఉద్యోగి కొలువు ఊడిపోయింది. ఉద్యోగి చేసిన వ్యాఖ్య‌ల‌కు ప్ర‌భుత్వం చేసిన ప‌నిని కొంద‌రు స‌మ‌ర్థిస్తుంటే... రాజ‌కీయ నాయకుల‌పై విమ‌ర్శ‌లు స‌హ‌జ‌మే కాబ‌ట్టి దానికి ఇంత సీరియ‌స్ అవ్వాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని మ‌రికొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.

వివ‌రాల్లోకి వెళితే...కేరళ రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇటీవల దుబాయ్‌లో పర్యటించారు. అక్కడి విదేశీ వాణిజ్య మంత్రిత్వశాఖ, మానవవనరుల అభివృద్ధి శాఖకు సంబంధించిన యూఏఈ మంత్రులు, అధికారులతో స‌మావేశాలు జ‌రిపారు. ఈ విష‌యం గురించి తెలియజేసేందుకు ఆ స‌మావేశాల ఫోటోల‌ను సీఎం పినరయి విజయన్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అయితే, ఏ.మణికుట్టన్ అనే సచివాలయ ఉద్యోగి స‌చివాల‌య ఉద్యోగి ఈ పోటోపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

ఈ ఫోటోల‌లో నల్ల సూట్ వేసుకుని ఉన్న సీఎం విజయన్ ఫోటోను షేర్ చేస్తూ “గూండాలు వేర్వేరు వేషధారణలో ఉన్నారు” అంటూ మణికుట్టన్ వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్ట్‌పై ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. కొందరు సచివాలయ అధికారులు సీఎం కార్యాలయం దృష్టికి తీసుకెళ్లడం, దీంతో మణికుట్టన్ ఉద్యోగం ఊస్ట్ అయిపోవ‌డం జ‌రిగింది.

అయితే, కాంగ్రెస్ అనుకూల సచివాలయ ఉద్యోగుల సంఘంలో సభ్యుడిగా మణికుట్టన్ ఉన్నందున అతనిపై కక్షకట్టిన అధికార వామ‌ప‌క్ష‌ పార్టీ అనుకూల ఉద్యోగుల సంఘం ఈ విధంగా టార్గెట్ చేసింద‌ని కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. ఇదిలాఉండ‌గా, ఇటీవ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా వాట్సాప్‌లో కామెంట్లు చేశార‌ని కొంద‌రిపై పోలీస్ కేసులు న‌మోదు అయిన సంగ‌తి తెలిసిందే.