Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఎర్ర‌న్న‌ల హిత‌బోధ‌!

By:  Tupaki Desk   |   29 Sep 2021 4:30 PM GMT
ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఎర్ర‌న్న‌ల హిత‌బోధ‌!
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు క‌మ్యూనిస్టు పార్టీలు హిత‌బోధ చేస్తున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు స్పందించాల్సింది సినిమా టికెట్ల అంశంలో కాద‌ని, ప్ర‌జాస‌మ‌స్య‌ల మీద అని ఎర్ర‌న్న‌లు అంటున్నారు. ఒక‌వైపు ప్ర‌జ‌లు ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్న త‌రుణంలో వాటిని వదిలి.. సినిమా టికెట్ల మీద పోరాడ‌టాన్ని వారు త‌ప్పు ప‌డుతున్నారు.

ఒక‌వైపు ఏపీలో ప‌లు ప్రాంతాల్లో స‌రైన వ‌ర్షాలు లేక ఖ‌రీఫ్ పంట‌లు ఎండిపోతున్న వైనాన్ని ఎర్ర‌న్న‌లు ప్ర‌స్తావిస్తూ ఉన్నారు. వేరుశ‌న‌గ పంట ను సాగు చేసిన రైతుల‌కు మ‌రో ఏడాది న‌ష్టాలే మిగిలే ప‌రిస్థితి నెల‌కొంది. ఇలాంటి నేప‌థ్యంలో.. ప్ర‌భుత్వం ఆ అంశం మీద దృష్టి సారించాల‌ని ఎర్ర‌న్న‌లు డిమాండ్ చేశారు. ఇలాంటి స‌మ‌యంలో ప‌వ‌న్ అలాంటి స‌మ‌స్య‌ల గురించి ప‌ట్టించుకోకుండా సినిమా టికెట్ల వ్య‌వ‌హారాన్ని హైలెట్ చేయ‌డాని క‌మ్యూనిస్టు పార్టీలు త‌ప్పు ప‌డుతున్నాయి.

అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మ‌కం వ్య‌వహారాన్ని కూడా క‌మ్యూనిస్టులు ప్ర‌స్తావిస్తున్నారు. దాదాపు రెండు వంద‌ల రోజుల‌కు పై నుంచి కార్మికులు ఆందోళ‌న‌లు చేప‌డుతున్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. అలాంటి ఆందోళ‌న‌ల‌కు ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని, కార్మికుల నిర‌స‌న శిబిరాన్ని ప‌వ‌న్ సంద‌ర్శించాల‌ని వారు కోరుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేట్ ప‌రాన్ని వ్య‌తిరేకించే పోరాటంలోకి క‌లిసి రావాల‌ని అంటున్నారు.

ఇలా వాస్త‌వమైన స‌మ‌స్య‌ల‌నే క‌మ్యూనిస్టు పార్టీలు ప్ర‌స్తావిస్తూ ఉన్నాయి. ఈ పోరాటంలోకి ప‌వ‌న్ రావాల‌ని కోరుతున్నాయి. మ‌రి ప‌వ‌న్ కు క‌మ్యూనిస్టులు మాజీ మిత్రుల‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఎర్ర‌జెండా వేసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్, ఇప్పుడు కాషాయ జెండాకు మిత్రుడిగా సాగుతున్నాడు. కాషాయ వాదాన్ని వినిపిస్తున్నాడు. మ‌రి ఇలా మారిపోయిన ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఎర్ర‌న్న‌ల పిలుపులు వినిపిస్తాయా?