Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌తో కలుస్తాం.. కానీ పొత్తు పెట్టుకోం!

By:  Tupaki Desk   |   13 April 2015 5:40 AM GMT
కాంగ్రెస్‌తో కలుస్తాం.. కానీ పొత్తు పెట్టుకోం!
X
కమ్యూనిస్టు పార్టీలవి భలే చిత్రమైన రాజకీయాలు. ఏడాదికీ రెండేళ్లకూ ఒకసారి వీరిలో రియలైజేషన్‌ వస్తూ ఉంటుంది. చేసిన పొరపాట్లన్నీ గుర్తు తెచ్చుకొంటారు.. ఇకపై అలాంటివి చేయమని ప్రతినబూనుతారు. అయితే మళ్లీ మామూలే! ఏ విషయాల్లో అయితే రియలైజ్‌ అయ్యామని ప్రకటించుకొంటారో..ఆ విషయాల్లో పాత తీరునే అనుసరిస్తూ ఉంటారు. అలా ముందుకు పోతూ ఉంటారు.

ప్రస్తుతానికి అయితే కమ్యూనిస్టు పార్టీలు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఉనికి కూడా కష్టం అయ్యింది. ఈ నేపథ్యంలో సీపీఎం జాతీయ మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ.. తిరిగి బలపడటం గురించి తాము చర్చింనున్నామని అంటున్నారు.

కొన్ని విధానపరమైన అంశాల గురించి కూడా వారు స్పందిస్తున్నారు. ఇకపై ఏ ప్రాంతీయ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోమని సీపీఎం నేతలు ప్రకటన చేయడం విశేషం. తాము సొంతంగా ఎదగాలని భావిస్తున్నామని.. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ ప్రాంతీయ పార్టీలతో పొత్తు లు పెట్టుకొని తాము అన్యాయం అయిపోయామని ఈ పార్టీ నేతలు అంటున్నారు. అందుకే ఇకపై ఎవరితోనూ పొత్తు ఉండవని.. లౌకిక వాదానికి కట్టుబడ్డ పార్టీలతో కలిసి పోరాటం అయితే చేస్తామని ప్రకటించారు.

కాంగ్రెస్‌ పార్టీతో కూడా కలిసి పోరాడటానికి తాము సిద్ధంగాఉన్నామని ఎర్రన్నలు ప్రకటించారు. మరి మొన్నటి వరకూ కాంగ్రెస్‌ విధానాలపై దుమ్మెత్తి పోసి ఇప్పుడప్పుడే కాంగ్రెస్‌ పార్టీ తో కలిసి పోరాడటానికి సై అని.. అనడం విచిత్రమే. అదేంటి అంటే.. లౌకికవాదానికి ఇప్పుడు భంగం కలుగుతోందని.. అందుకే కాంగ్రెస్‌తో చేతులు కలుపుతామని అంటున్నారు.

మరి ఇలాంటి రాజకీయాలతోనే కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చింది. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వీళ్ల పనేమవుతుందో!