Begin typing your search above and press return to search.

లెఫ్ట్ పార్టీలకి ఊహించని షాక్... జాతీయహోదా రద్దు

By:  Tupaki Desk   |   10 Aug 2019 8:43 AM GMT
లెఫ్ట్ పార్టీలకి ఊహించని షాక్... జాతీయహోదా రద్దు
X
గతమెంతో ఘనం..ప్రస్తుతం అథమం అనే వ్యాఖ్య లెఫ్ట్ పార్టీలకి కరెక్ట్ గా సరిపోతుంది. ఒకప్పుడు దేశంలో ఒక వెలుగు వెలుగిన కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు కనుమరగయ్యే స్థితికి వచ్చాయి. పేదలకోసం పోరాటాలు చేసిన కమ్యూనిస్టులు ఇప్పుడు తమ భవిష్యత్ కోసం పోరాడాల్సిన పరిస్తితి వచ్చింది. ఇక ఎలాగోలా తమ ఉనికిని చాటుకోడానికి ప్రయత్నిస్తున్న సీపీఐ, సీపీఎం పార్టీలకి ఊహించని షాక్ తగిలింది. ఈ రెండు పార్టీలకి జాతీయహోదాని రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్నికలసంఘం 2013 లో జారీచేసిన నోటిఫికేషన్‌ ఆధారంగా సీపీఎం- సీపీఐ పార్టీలకు జాతీయహోదా రద్దు చేసింది. ఏదైనా పార్టీకి జాతీయ హోదా రావాలంటే చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఇక ఆ ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు సాధించాలి. దీనితోపాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం న‌లుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి.

అలాగే రాష్ట్ర పార్టీ హోదా ఉండాలంటే శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కనీసం ఆరుశాతం ఓట్లు సాధించాలి. అలాగే కనీసం రెండు అసెంబ్లీ స్థానాలైనా అయినా గెలవాలి. అంతే కాకుండా ఆ రాష్ట్రంలో జరిగే లోక్‌ సభ ఎన్నికల్లో కనీసం ఆరుశాతం ఓట్లు రావాలి. దీంతో పాటు ఓ లోక్‌ సభ స్థానాన్ని గెలవాలి. ఇక ఆ రాష్ట్రంలో 25 లోక్‌ సభ స్థానాల కంటే ఎక్కువ ఉంటే. ప్రతి 25 స్థానాలకి ఒకటి గెలవాలి. అలా కాకపోతే ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 3శాతం ఓట్లు లేదా మూడు అసెంబ్లీ స్థానాల్లో అయినా గెలవాలి.

కానీ ఇటీవల జరిగిన లోక్ సభ, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ పార్టీలు కనీసం ప్రభావం చూపలేదు. ఎక్కడిక్కడ దారుణంగా ఓటమిపాలైంది. ఒక‌ప్పుడు బెంగాల్‌- త్రిపుర లాంటి చోట్ల ఏకంగా రెండున్నర ద‌శాబ్దాలుగా ఏలిన క‌మ్యూనిస్టులు నేడు అక్క‌డ ప్ర‌భావం కోసం పాకులాడాల్సిన ప‌రిస్థితులు వ‌చ్చేశాయి. ఇక ఇప్పుడు క‌మ్యూనిస్టుల వైభ‌వం కేర‌ళ‌కే ప‌రిమిత‌మయ్యేలా ఉంది. ఇక తాజాగా ఆ పార్టీలు జాతీయ పార్టీ హోదాకు కావాల్సిన ఓట్లు, సీట్లు కూడా సాధించ‌క‌పోవ‌డంతో కేంద్ర ఎన్నికల సంఘం సీపీఐ- సీపీఎం పార్టీలకు జాతీయ హోదా రద్దు చేసింది.