Begin typing your search above and press return to search.

జగన్ కు కామ్రేడ్స్ తోడయ్యారు

By:  Tupaki Desk   |   1 Aug 2016 5:43 AM GMT
జగన్ కు కామ్రేడ్స్ తోడయ్యారు
X
ఏపీ ప్రత్యేకహోదా అంశంపై రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానంపై రాజకీయంగా ఎంత రచ్చ జరుగుతుందో తెలిసిందే. ఏపీకి తీరని అవమానం.. అన్యాయం జరిగిందంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుండెలు బాదుకుంటుంటే.. ఇంతకంటే అన్యాయం.. దారుణం ఇంకేం ఉంటుందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడుతున్నారు. ఏపీ ప్రజలకు అన్యాయం జరిగేలా ఉన్న జైట్లీ మాటలపై ఏపీ విపక్ష నేత జగన్.. ఏపీ బంద్ కు పిలుపునివ్వటం తెలిసిందే.

విపక్షం ఇచ్చిన బంద్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు పట్టటమే కాదు.. బంద్ అంటే నిరసనలు కాదని.. ఉత్పత్తిని పెంచాలని.. రోడ్లు ఊడవాలని.. మురికి కాల్వల్ని శుభ్రం చేసి కేంద్రం మీద తమ నిరసనను వ్యక్తం చేయాలని.. చేతికి నల్లబ్యాడ్జిలు కట్టుకోవాలంటూ చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంద్ చేయటం ఏ మాత్రం సమంజసం కాదన్నది చంద్రబాబు మాట.

అయితే.. ఇదంతా రాజకీయంగా వచ్చే మైలేజీని అడ్డుకోవటం కోసం చంద్రబాబు ఆడుతున్న నాటకంగా విపక్షాలు అభివర్ణిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు.. రాష్ట్రంలోని చంద్రబాబు సర్కారు కారణంగానే ఏపీకి ప్రత్యేకహోదా రావటం లేదన్నది జగన్ పార్టీ నేతల వాదన. తాము పిలుపునిచ్చిన బంద్ ను పెద్ద ఎత్తున చేపట్టి తమ సత్తా చాటటంతో పాటు.. ఏపీ సర్కారుపై భావోద్వేగ వ్యతిరేకతను పెంచాలన్నది జగన్ ​టీం ఆలోచనగా చెప్పొచ్చు. ఇలా ఎవరికి వారుగా అధికార.. విపక్షాలు తమ తమ పొలిటికల్ మైలేజీ కోసం ప్రత్యేక హోదా అంశాన్ని వాడుకుంటున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే ఈ ఆటలో.. కమ్యూనిస్టులు తమ భాగం కోసం పావులు కదిపారు. విభజన సమయంలో విభజనకు అనుకూలంగా వ్యవహరించిన సీపీఐ.. విభజనను వ్యతిరేకించిన సీపీఎం పార్టీలు ఏపీ తరఫున ఒక్కమాట అంటే ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు. విభజన సమయంలో కమ్యూనిస్టుల వ్యవహారశైలిపై విసిగిన ఆంధ్రులు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి కాంగ్రెస్ కు వేసిన శిక్ష వేయటంతో పాటు.. ఆ పార్టీకి గతంలో ఉన్న ఛరిష్మా పూర్తిగా తగ్గిపోయిన దుస్థితి. దీంతో..ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా చక్కటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న కమ్యూనిస్టులకు తాజా పరిణామాలు కలిసి వచ్చినట్లుగా మారాయి. అందుకే.. జగన్ పార్టీ పిలుపునిచ్చిన ఏపీ బంద్ కు తోడుగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు పిలుపునివ్వటం గమనార్హం. కామ్రేడ్స్ తాజా నిర్ణయంతో జగన్ కు కమ్యూనిస్టులు తోడయ్యారని చెప్పాలి.