Begin typing your search above and press return to search.

మీరు రాకున్నా మేం ప్రొసీడ్ అవుతాం!

By:  Tupaki Desk   |   12 April 2018 6:05 AM GMT
మీరు రాకున్నా మేం ప్రొసీడ్ అవుతాం!
X
జనసేన అదినేత పవన్ కల్యాణ్ తో సీపీఎం మధు - సీపీఎం రామకృష్ణ గురువారం సమావేశం కాబోతున్నారు. అయితే.. ఈ భేటీలో ప్రత్యేకహోదా కోసం ఉద్యమ కార్యాచరణ గురించి వారు పవన్ తో చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పోరాటాల విషయంలో పాదయాత్ర తర్వాత ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇంత స్తబ్ధుగా కూర్చోవడం అలవాటు లేని వామపక్ష నాయకులు.. కార్యచరణ గురించి ఆయనతో సీరియస్ గానే చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.

జనసేన- వామపక్షాలు ఒక కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. వీరు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నారనేది సమాచారం. ఆ సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతానికి కలిసి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే జనసేన అన్ని కార్యక్రమాలకు వామపక్షాలు కలిసి వస్తున్నాయి గానీ.. వారు చేస్తున్న అన్ని కార్యక్రమాలకు జనసేన ఆ రకంగా హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో నిత్యం పోరాటాలతోనే మనుగడ సాగించే వామపక్ష పార్టీలు జనసేనతో కలిసి మాత్రమే వెళ్లాలంటే.. ఇబ్బంది పడుతున్నాయి.

ఈ భేటీలో.. పవన్ కల్యాణ్ కు హోదాకోసం ఎలాంటి పోరాటాలు సాగించే ఉద్దేశం ఉందో తేల్చుకోవాలని వామపక్ష పార్టీలు అనుకుంటున్నట్లు సమాచారం. మీరు కలిసి రాకపోయేట్లయితే.. మా అంతట మేం మా మార్గంలో పోరాటాలు చేసుకుంటూ పోతాం అని కూడా పవన్ కు వారు స్పష్టంగా తేల్చి చెప్పదలచుకున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పవన్ సైలెంట్ గానే ఉండదలచుకున్నారని.. కానీ.. లెఫ్ట్ పార్టీలు జనసేనను మినహాయించి.. తమ ధోరణిలో పోరాటాలను కొనసాగించాలని అనుకుంటున్నాయని తెలుస్తోంది.

మరి వైకాపా - తెదేపాలకు పోరాటాల్లో చిత్తశుద్ధి లేదని శకునాలు పలుకుతూ ఉండే జనసేన.. తను అసలు నామమాత్రపు పోరాటాలైనా సాగించడానికి సిద్ధంగా ఉందో లేదో వేచిచూడాలి.