Begin typing your search above and press return to search.

ఎర్రన్నలది మితిమీరిన ఆశావాదమా...?

By:  Tupaki Desk   |   29 Aug 2022 12:30 AM GMT
ఎర్రన్నలది మితిమీరిన ఆశావాదమా...?
X
ఈ దేశంలో అధికారంలోకి రావాలంటే ఇక్కడ సెంటిమెంట్లకు పెద్ద పీట వేయాలి. ఇక్కడ చెట్టూ కొమ్మా గోడ రాయి, పిట్టా పురుగు గాలీ నీరు, నిప్పు ఇలా అన్నింటికీ జనాలు నమ్ముతూ అందులో దేవుడిని చూస్తారు. ఇక ఈ దేశంలో జనాలకు మతాలు ఉన్నాయి. కులాలు ఉన్నాయి. ప్రాంతాలు ఉన్నాయి. పట్టింపు కూడా ఉంది. ఇలా ఎన్నో రకాలైన భావావేశాలు కలిపితేనే భారతీయులు అవుతారు.

అయితే కమ్యూనిస్టులు మాత్రం ఎక్కడో పుట్టిన పార్టీని తెచ్చి ఈ దేశంలో జెండా పాతాలనుకున్నారు. నిజానికి కమ్యూనిజం లో నిజం ఉంది. అలాగే పేదవారి కోసం పాటుపడాలన్న ఉద్దేశ్యంలో పరమార్ధం ఉంది. వాటిని అలా సిద్ధాంతాలుగా పెట్టుకుంటూనే ఇంకా లోతుల్లోకి వెళ్లాలి. జనాలకు అర్ధమయ్యే భాషలో చెప్పాలి. ఈ దేశంలో సామ్యవాదం కోసం పోరాడిన వారిని జనం ముందు పెడితే వారికి అర్ధమవుతుంది. కానీ విదేశాలలో ఉన్న నాయకులను ఇక్కడ వల్లిస్తే ఉపయోగం ఉంటుందా.

నిజానికి ఏ రోజు అయినా పేదవాడు ఉంటాడు కాబట్టి కమ్యూనిజం ఎపుడూ ఉండాల్సిన రాజకీయ మందే. దాంతో పాటు తమ సిద్ధాంతాలను భారతీయకరణ చేయడంలో కామ్రేడ్స్ బాగా వెనకబడ్డాయని అంటారు. అదే టైమ్ లో ఒకే రకమైన భావజాలం ఉన్న సీపీఐ, సీపీఎం ఎందుకు కలసి పోటీ చేయవో అర్ధం కాదు. ముందు ఆ రెండు పార్టీలు ఒక్కటిగా వస్తే దేశంలో వారి రాజకీయ బలం పెరుగుతుంది. పశ్చిమ బెంగాల్ లో అప్రతిహతంగా అధికారం చలాయించిన కమ్యూనిస్టులు ఇపుడు కేరళకు మాత్రమే పరిమితం అయ్యారు. అక్కడ కూడా సీపీఎం సర్కార్ మాత్రమే ఉంది.

ఈ నేపధ్యంలో మోడీ సర్కార్ వ్యతిరేక విధానాలను వినిపించడంతో ముందున్న కమ్యూనిస్టులు బీజేపీని గద్దె దించాలని నినదిస్తున్నారు. విశాఖలో దాదాపుగా యాభై ఏళ్ల తరువాత జరిగిన సీపీఐ రాష్ట్ర మహా సభలకు పార్టీ జనాలు బాగానే వచ్చారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా మాట్లాడుతూ దేశంలో ప్రజాతంత్ర లౌకిక శక్తులు అన్నీ ఏకం కావాలని కోరారు. అదే విధంగా బీజేపీని గద్దె దించకపోతే ఈ దేశం బాగుపడని కూడా అన్నారు. అంతా ఏకం కావాలని ప్రాంతీయ పార్టీలు కూడా ముందుకు రావాలని సీపీఐ అగ్ర నాయకత్వం కోరుతోంది.

అయితే దేశంలో పురాతన పార్టీగా ఉన్న సీపీఐ ఈ రోజు ఉనికి పోరాటం చేస్తోంది. తన సిద్ధాంతాలను జనంలో పెట్టి మద్దతు పొందలేకపోతోంది. పొత్తులతో కాలక్షేపం చేద్దామన్నా కొత్తగా పుట్టిన పార్టీలు కూడా దూరంగానే మసలుతున్నాయి. మరి లోపం ఎక్కడ ఉందో తెలుసుకోకుండా ఢిల్లీ కోటను బద్ధలు కొడతామన్న పెద్ద మాటలతో పొద్దు పుచ్చితే కమ్యూనిజానికి రాణింపు ఉంటుందా అన్నదే చర్చగా ఉంది.

నిజానికి ఇక్కడ మెచ్చాల్సింది ఏంటి అంటే కామ్రేడ్స్ కి ఎంతో ఆశాభావం ఉంటుంది. వారికి ఉన్న ఆశ ఎవరెస్ట్ శిఖరం కంటే ఎక్కువే. కానీ కాలాలు మారుతున్నాయి. తాము కూడా మారి జాతి జనుల ఉద్ధరణలో తమ వంతు పాత్ర రాజకీయంగానే చేసి అధికారం కధ ఏంటో తేల్చుకుందామన్న తాపత్రయం కూడా ఉండాలి కదా అన్నదే ఆ భావజాలాన్ని ప్రేమిస్తున్న వారికి పట్టుకున్న బాధ. అందరినీ కలవమని చెబుతున్నా ఎర్రన్న గొంతులకు పీలగా బేలగా మారితే ఉపయోగం ఏముంటుందో వారే చెప్పాలి మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.