Begin typing your search above and press return to search.

అదృష్టమంటే రమణదే

By:  Tupaki Desk   |   15 Dec 2021 5:11 AM GMT
అదృష్టమంటే రమణదే
X
అదృష్టం ఎవరి తలుపు ఎప్పుడు తడుతుందో ఎవరికీ తెలీదు. అలాగే ఏ రూపంలో మనింటి గుమ్మం తొక్కుతుందో కూడా ఎవరు చెప్పలేరు.

సుదీర్ఘకాలం తెలంగాణాలో టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్న ఎల్ రమణను కేసీయార్ రూపంలో అదృష్టం వరించింది. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన దగ్గర నుండి పాపం రమణకు చెప్పుకోదగ్గ పదవులేమీ లేవు. దానికితోడు 2014లో జరిగిన రాష్ట్ర విభజనతో మరీ అన్యాయం అయిపోయారు.

తెలుగుదేశంపార్టీ తెలంగాణా అధ్యక్షుడు అనితప్ప చెప్పుకోవటానికి ఇంకేమీ లేదు. దాదాపు శిధిలాస్తలో ఉన్న పార్టీకి సుమారు ఏడేళ్ళు అధ్యక్షునిగా పనిచేశారు.

ఎంతకష్టపడినా పార్టీ లేచేదేమీ లేదు తెలంగాణాలో అని తెలిసినా పార్టీనే అంటిపెట్టుకునిండిపోయారు. సరే ఏదో ముహూర్తంలో రమణ టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీయార్ కంట్లో పడ్డారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల సమయంలో రమణ తెలుగుదేశంపార్టీకి రాజీనామా ఇచ్చేసి కారుపార్టీలోకి జంప్ అయిపోయారు.

టీడీపీ అధ్యక్షునిగా నువ్వు చేసే పేనేముందయ్యా ? ఈగలు తోలుకోవటం తప్ప అని బాహాటంగానే రమణతో చెప్పారు. దాంతో వెంటనే రమణ సైకిల్ దిగి కారెక్కేశారు. ఇక్కడ కేసీయార్ ఉద్దేశ్యం ఏమిటంటే బీసీ నేతయిన రమణ హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి శ్రీనివాసయాదవ్ గెలుపుకు సాయం అవుతుందని. కానీ కేసీయార్ అనుకున్నదొకటైతే చివరకు జరిగింది మరొకటి.

అధికారపార్టి తరపున శ్రీనివాసయాదవ్ పోటీచేసినా బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసిన ఈటల రాజేందర్ దెబ్బకు కుదేలైపోయారు. అంటే రమణ వల్ల టీఆర్ఎస్ కు జరిగిన ఉపయోగం కూడా ఏమీ లేదని అర్ధమైపోయింది. రమణ వల్లే కాదులేండి మరో ఎంఎల్సీ కౌశిక్ రెడ్డి వల్ల కూడా జరిగిన మేలు సున్నాయే. కేసీయార్ తో పాటు ఇంతమంది హేమా హేమీలు పనిచేసినా తమ అభ్యర్ధిని గెలిపించుకోలేకపోయారు.

సరే ఇంతకీ విషయానికి వస్తే రమణ అదృష్టం మాత్రం బ్రహ్మాండంగా పనిచేసింది. టీఆర్ఎస్ లోకి రావటం, స్ధానికసంస్ధల ఎన్నికల్లో ఎంఎల్సీగా పోటీచేయటం గెలవటం వెంట వెంటనే జరిగిపోయాయి.

టీడీపీలోనే ఇంకో 25 సంవత్సరాలున్నా రమణకు అధికారిక పదవి దక్కేది అనుమానమే. అలాంటిది టీఆర్ఎస్ లో చేరిన రెండు నెలలకే ఎంఎల్సీ యోగం పట్టేసింది. అందుకనే ఇపుడందరు రమణ అదృష్టమే అదృష్టమంటున్నారు.